అమ్మాయి పెళ్లికి ముందు తండ్రి ఇంటి పేరుతో చదువు కొనసాగిస్తుంది. ఉద్యోగంలోనూ అదే పేరు ఉంటుంది.
కానీ పెళ్లయ్యాక తన ఇంటి పేరు మారిపోతుంది. కాదు మార్చాల్సివస్తుంది. ఈ కారణం వల్ల జపాన్‌లోని ప్రేమికులు పెళ్లి వద్దంటున్నారంట.
ఈ కథ కాస్త పెద్దదే. కానీ ఓపికగా వివరాల్లోకి వెల్దాం.. మూడేళ్ల కిందట 34 ఏళ్ల మేరీ ఇనుకి ఆమె బాయ్ ఫ్రెండ్ కొటారి ఉసుయితో పెళ్లి నిశ్చయమయింది.
అయితే వారు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని అంటున్నారు. దీనికి కారణం పెద్దలు అభ్యంతర పెట్టడమో, కోవిడ్ సంక్షోభమో కాదు.
గొడవంతా పెళ్లి చేసుకున్న తర్వాత మారే ఇంటి పేరు. భార్యభర్తల ఇంటి పేర్లు ఒకేలా ఉండాలని జపాన్‌లోని పాత చట్టం ఒకటి శాసిస్తోంది.
ఆ ఇంటి పేరు అమ్మాయిదైనా కావచ్చు లేదా అబ్బాయిదైనా కావచ్చు. మొత్తానికైతే పెళ్లి తరువాత ఇద్దరికీ ఒకే ఇంటిపేరు ఉండాలి.
కానీ సాధారణంగా 96 శాతం అమ్మాయిలే వివాహం తర్వాత తమ ఇంటి పేర్లను మార్చుకుంటారు అక్కడ.
“ఇది చాలా అన్యాయం. మా ఇంటి పేర్లను కొనసాగించే స్వతంత్రం ఉండాలి” అని ఇను అంటారు. ఈ అభిప్రాయంతో కొటారి కూడా ఏకీభవిస్తున్నారు.
“నేను ముందు ఇంటి పేరు మార్చుకుందామనుకున్నాను. కానీ మా బంధువులలో కొందరికి అది నచ్చలేదు.
నాకు ఎవరినీ బాధపెట్టాలని లేదు. మేం ఇంటి పేరును మార్చుకోవాలా, ఉంచుకోవాలా అనే విషయంలో మాకు స్వేచ్ఛ ఉండాలి” అని అన్నారు వారిద్దరూ.
వివాహం తరువాత వేర్వేరు ఇంటి పేర్లు ఉండడంపై చట్టపరంగా అభ్యంతరం ఉన్న దేశాలలో జపాన్ కూడా ఒకటి.
ఇలాంటి చట్టం మహిళలపై వివక్ష చూపుతోందని ఐరాస కమిటీ ఒకటి అభిప్రాయపడింది. ఈ నియమాలను మార్చాలని ఆరేళ్ల కిందట వేసిన రెండు కేసులు కోర్టులో వీగిపోయాయి.
కానీ ఇను, ఉసుయి లాంటి వారి చేరికతో సంస్కరణల కోసం చేస్తున్న ఉద్యమం మరింత ఊపందుకుంది. ఇంటిపేర్ల విషయంలో ఎప్పటి నుంచో పోరాటం జరుగుతోంది.
1605లో ఒక మహిళ వివాహం తర్వాత తన పుట్టింటి పేరును ఉంచుకోవాలనే కోరిక నెరవేరలేదని డాక్టర్ సోఫీ కులాంబో రాశారు.
ఈ పితృస్వామ్య విధానాన్ని సవాలు చేసిన వారికి ఆగ్రహంతో కూడిన ప్రతిఘటన ఎదురైంది.
కొంత మంది 1800 ప్రాంతంలో కోర్టు కేసుల ద్వారా తమ ఇంటి పేర్లను ఉంచుకునే అవకాశాన్ని పొందారు.
ఇలాంటి పోరాటమే అమెరికాలో సఫ్రాగేట్స్ కూడా ఎదుర్కొన్నారు.
మహిళలు తమ ఇంటి పేరును వాడుకోవచ్చని తీర్పులు వెలువడడానికి 1972 వరకు వేచి చూడాల్సి వచ్చింది.
40 ఏళ్ల తర్వాత కూడా జపాన్ ఆ మలుపు తిప్పే క్షణం కోసం ఇంకా ఎదురు చూస్తోంది.
ఇంటిపేర్ల మార్పులకు సంబంధించిన చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని అది మానవ హక్కులను ఉల్లఘిస్తోందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావురి ఓగునై మరో నలుగురితో కలిసి కేసు వేశారు.
కానీ 19వ శతాబ్దపు నియమాన్ని సమర్థిస్తూ ఒక కుటుంబం ఒకే ఇంటి పేరును వాడటం సమంజసమని జపాన్ సుప్రీం కోర్టు 2015లో తీర్పు ఇచ్చింది.
“ఒక పొగరుగా ఉన్న టీచర్ మమ్మల్ని కసురుతున్నట్లుగా అనిపించింది” అని ఓగునై చెప్పారు.
ఆమె అనధికారికంగా తన పుట్టింటి పేరునే వాడుకుంటున్నారు. “కోర్టు కూడా వ్యక్తికున్న హక్కులను గౌరవిస్తుందని ఆశించాను” అని అన్నారు.
అయితే దీనిపై కొత్త చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యత పార్లమెంటుదని జడ్జి అన్నారని ఆమె చెప్పారు.
చాలా పని స్థలాలలో లాగే జపాన్‌లో రాజకీయ చిత్రం కూడా పురుషులతో నిండిపోయి ఉంది.
మహిళలే ఇంటి పని పిల్లల సంరక్షణ చూసుకోవాలని సామాజిక నియమాలు పాతుకుపోయి ఉన్నాయి.
ఇక్కడ కూడా లైంగిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
జపాన్ లైంగిక సమానత విషయంలో 153 దేశాలలో 121వ స్థానంలో ఉన్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక ఒకటి వెల్లడించింది.
ఇంటి పేరును మార్చుకోవడం వలన ఉద్యోగం చేసే మహిళలు కొన్ని డజన్ల డాక్యుమెంట్లలో కూడా తమ పేర్లను మార్చుకోవలసి వస్తుంది.
ఇది చాలా పెద్ద ప్రక్రియ. ఈ ఇంటి పేర్ల చట్టం వలన ఇంటి పేర్లను మార్చుకోకపోతే ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునేటప్పుడు ఎవరి గురించి అయినా నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు.
ఈ కారణం వలన కూడా చాలా మంది వివాహం చేసుకోకుండా ఉండిపోయారు.
చాలా మంది మహిళలకు ఇది వారి గుర్తింపుతో సంబంధం ఉన్న అంశం.
కేవలం పుట్టింటి ఇంటి పేరును ఉంచుకోవడం కోసమే ఇజుమీ ఓంజీ అనే అనెస్థిస్ట్ తన భర్తకు అసాధారణ రీతిలో విడాకులు ఇచ్చారు.
ఈ విడాకులు కేవలం కాగితానికే పరిమితం. ఆమె విడాకుల తర్వాత కూడా భర్తతోనే కలిసి ఉంటున్నారు.
“అది నేను, అది నా గుర్తింపు” అని 65 సంవత్సరాల ఓంజీ అంటారు.
ఈమె కూడా కోర్టులో దీని కోసం పోరాడుతున్నారు.
భర్త ఇంటి పేరును పెట్టుకోవడం వలన కుటుంబంతో దగ్గరైన భావన కలుగుతుందని తీసుకునే సహజమైన నిర్ణయం” అని 20 సంవత్సరాల మహిళ చెప్పారు.
బ్రిటిష్ మహిళల్లో 90 శాతం మంది వివాహం తర్వాత తమ పేరును మార్చుకున్నారని 2016లో నిర్వహించిన ఒక సర్వే తెలిపింది.