సెంచ‌రీకి చేరువైన ఇషాంత్‌

244

ఇషాంత్ శ‌ర్మ‌… భార‌త క్రికెట్ జ‌ట్టులో సీనియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్‌. ప్ర‌పంచంలోని క్రికెట్ ఆడే దేశాల అన్ని పిచ్‌ల‌పై అనుభ‌వ‌మున్న వ్య‌క్తి.

ఎన్నో ఒడుదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. ఎన్నోసార్లు గాయాల‌పాలై మ‌ళ్లీ జ‌ట్టులో చోటు సంపాదించాడు. అలాంటి భార‌త ఫాస్ట్ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ బుధ‌వారం ఇంగ్లండ్‌తో మొతేరా స్టేడియంలో 100వ టెస్టు ఆడ‌నున్నాడు.

భార‌త క్రికెట్ దిగ్గ‌జ పేస్ బౌల‌ర్ క‌పిల్ దేవ్ స‌ర‌స‌న నిల‌వ‌నున్నాడు. ఓ పేసర్‌ గాయాలను అధిగమించి వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మంది మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.

టీమిండియా తరఫున మాజీ పేసర్ కపిల్‌దేవ్‌ (131) వంద టెస్టులు ఆడాడు. ఆ తర్వాత ఎందరో పేసర్లు భారత జట్టులోకి వచ్చినా.. వారెవ్వ‌రూ ఈ మార్క్‌ చేరుకోలేకపోయారు.

సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడిన జహీర్‌ ఖాన్‌ (92) సెంచరీకి ముందే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. కానీ ఆ ఘనత ఇప్పుడు సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మను వరించనుంది.

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టెస్టు ఇషాంత్‌కు వందో టెస్ట్ మ్యాచ్. సెంచరీ మ్యాచ్‌కు ముందు ఇషాంత్ మీడియాతో పలు విష‌యాలు చెప్పాడు.

కెప్టెన్‌లు ఉత్త‌మ ప్రదర్శన రాబట్టారు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషాంత్‌ మాట్లాడుతూ… ‘రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో నా కెరీర్‌ ఆరంభించా. ఆ తర్వాత అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే కెప్టెన్సీలోనూ ఆడా. అందరూ ఎంతో మద్దతిచ్చారు.

కెప్టెన్సీలో ఎవరి ప్రత్యేకత వారిదే. అయితే నాయకుడు పేసర్లను ఎలా వాడుకుంటాడనేది ముఖ్యం. ఈ విషయంలో కెప్టెన్లు నా నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టారు. కెప్టెన్‌ ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకోవడం ముఖ్యం.

అది అర్థమైతే విజయవంతంగా ముందుకు సాగొచ్చు’ అని అన్నాడు.

ఆ బాధ నాకు ఎప్పుడూ లేదు

వ‌న్డే, టీ20ల‌కు త‌న‌ను ఎంపిక చేయ‌నందుకు ఎన్న‌డూ బాధ‌ప‌డ‌లేద‌ని ఇషాంత్ అన్నాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నన్ను ఎంపిక చేయకపోవడంపై ఎలాంటి బాధ లేదు.

టెస్ట్ ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టీ20, వన్డేలను దృష్టిలో పెట్టుకొని ఉంటే.. టెస్టుల ప్రదర్శనపై అది తీవ్ర ప్ర‌భావం చూపేది.

అందుకే దాన్ని పక్కన పెట్టి టెస్ట్ ఫార్మాట్‌ కోసం నన్ను నేను కొత్తగా మలుచుకున్నా. భారత పేస్‌ దళానికి ఎక్కువ కాలం సేవలందించగలిగే సత్తా బుమ్రాకు ఉంది.

మహమ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైనీలో మంచి వేగం ఉంది. వాళ్లు ఇదే నిలకడను కొన‌సాగించాలి’ అని లంబూ పేర్కొన్నాడు.

వందో టెస్టు మామూలు మ్యాచ్ లాంటిదే

100వ టెస్టు మ్యాచ్‌ను కూడా ఇషాంత్ లైట్‌గా తీసుకున్నాడు. ఎందుకంటే దాన్ని ప్ర‌త్యేకంగా తీసుకుంటే మాన‌సిక ఒత్తిడికి గురయ్యే ప్ర‌మాద‌ముంది. ‘వందో టెస్టు ప్రత్యేకమైనదేమీ కాదని నా ఉద్దేశం.

గత మ్యాచ్‌లో ఎలాంటి తీవ్రతతో ఆడానో మొతెరాలోనూ అలానే బరిలోకి దిగుతా. వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టు విజయాలు సాధిస్తేనే ఎక్కువ ఆనందిస్తా. విజయాల్లో కీలక పాత్ర పోషించే సత్తా ఉన్నంత కాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా.

కపిల్‌దేవ్‌ 131 టెస్టుల ఘనతను అధిగమించాలంటే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి నా దృష్టంతా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మీదే. నా దృష్టిలో ఇది ప్రపంచకప్‌ గెలవడం లాంటిదే’ అని ఇషాంత్ చెప్పాడు.

మొతెరా అద్భుతం

అధునాత‌నంగా తీర్చిదిద్దుకున్న మొతేరా స్టేడియంపై ఇషాంత్ శ‌ర్మ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ‘ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతి స్వింగ్‌ అవడం సహజం. అయితే మంచు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకం.

సెషన్ల వారిగా పిచ్‌లో మార్పులు ఉంటాయనుకుంటున్నా. గులాబీ బంతి స్వింగ్ అవక‌పోతే సులువుగా బ్యాట్‌ మీదకు వస్తుంది. అలాంటి సమయంలో స్పిన్నర్లు ప్రధానమవుతారు.

అందుకే జట్టులో ఎవరు కీలకం అనేది ఇప్పుడే చెప్పలేం. మొతెరా స్టేడియం అద్భుతంగా ఉంది. ఇక్కడ మ్యాచ్‌ ఆడేందుకు అందరం ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ అని లంబూ అన్నాడు.

ఇషాంత్ గణాంకాలు

99 టెస్టులు.. 302 వికెట్లు.. 32.22 సగటు ఇదీ ఇషాంత్‌ శర్మ ప్రదర్శన. ఇవి గొప్ప గణాంకాలు మాత్రం కావు. వంద టెస్టులాడిన బౌలర్లు పడగొట్టిన వికెట్ల జాబితా చూస్తే.. ఇషాంత్‌ చివరి స్థానంలో ఉంటాడు.

కానీ గత కొన్నేళ్లలో లంబూ ప్రదర్శన ఎంతో మారింది. ఇషాంత్‌ టెస్టు కెరీర్‌ను మూడు భాగాలుగా విభజించవచ్చు.

తొలి 33 టెస్టుల్లో సగటు 32.6. కెరీర్‌ మధ్య దశలో 33 టెస్టుల్లో 41.34 సగటు నమోదు చేశాడు.

చివరి 33 టెస్టుల్లో ఆశ్చర్యకరంగా ఇషాంత్‌ సగటు 23.42 కావడం విశేషం.