ఐపీఎల్‌ను ఆపండి

454
ips officer files pil in madras high court to stop ipl

ఈ ఏడాది ఐపీఎల్ జరగకుండా ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఐపీఎల్‌లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని, అందువల్ల ఈ ఏడాది ఐపీఎల్‌ను జరపకూడదని సంపత్‌కుమార్ అనే ఆ అధికారి కోరారు. ఐపీఎల్‌లో ఆడే 8 జట్లను ఇందులో ప్రతివాదులుగా ఆయన చేర్చారు. ఓ విచారణ అధికారిగా తాను ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌ను బయటపెట్టానని ఆ పిల్‌లో సంపత్ పేర్కొన్నారు. ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో బుకీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఈ అధికారిని నాలుగేళ్ల పాటు సస్పెండ్ చేశారు.




 

అయితే ఈ ఏడాది మార్చిలో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టేయడంతో మళ్లీ విధుల్లో చేరారు. తమిళనాడు పోలీస్ క్యూ బ్రాంచ్‌లో సంపత్ ఎస్పీగా పనిచేస్తున్నారు. తాను ఐపీఎల్‌పై నిషేధం విధించాలని కోరడం లేదని, అయితే కొత్త సీజన్ మొదలయ్యే ముందే బెట్టింగ్ నిరోధించే ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నదే తన వినతి అని సంపత్ ఆ పిల్‌లో స్పష్టంచేశారు. బీసీసీఐ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ఐపీఎల్ నిర్వహించకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. ఐపీఎల్ 11వ సీజన్ ఈ నెల 7 నుంచి మొదలవనున్న విషయం తెలిసిందే.