
ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం. అధునాతన హంగులతో దీనిని తీర్చిదిద్దిన ఈ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ జట్లకు తొలి ఆతిథ్యం ఇవ్వబోతోంది.
బుధవారం నుంచి ఐదు రోజుల పాట్టు జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరిక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి.
దీంతో సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశమున్న ఈ డే/నైట్ టెస్టు మ్యాచ్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే చివరి రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది.
శార్దూల్ ఠాకూర్‌ను జట్టు నుంచి తప్పించి ఉమేశ్ యాదవ్‌ను తీసుకన్నారు. మెల్‌బోర్న్ టెస్టులో గాయపడిన ఉమేశ్‌కు సోమవారం ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలు ఉమేశ్ పాసయ్యాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
విజయ్ హజారె ట్రోఫీలో ఆడాలన్న ఉద్దేశంతో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను భారత జట్టు నుంచి విడుదల చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఠాకూర్ ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
‘టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఫిబ్రవరి 21న మొతేరా స్టేడియంలో జరిగిన ఫిట్‌నెస్ టెస్టుకు హాజరయ్యాడు. అందులో అతడు పాసయ్యాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు అతడిని జట్టులోకి తీసుకున్నారు’ అని బీసీసీఐ ప్రకటించింది.
బ్యాటింగ్ లైన్‌ప్‌లో మార్పులు లేవు
ఇంగ్లండ్‌తో జరగనున్న ఈ మూడో టెస్ట్ మ్యాచ్‌ను వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోణంలో చూస్తే కోహ్లీ సేనకు ఇది అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో టీమిండియా తన బ్యాటింగ్ లైనప్‌ను యథాతథంగా కొనసాగించి బౌలింగ్‌లో మార్పులు చేయనుంది.
పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు ఫిట్‌నెస్ నిరూపించుకున్న ఉమేష్ యాదవ్‌లను తుది జట్టులో చేర్చనున్నారు. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌తో పాటు పేసర్ ఇషాంత్ శర్మ తుది జట్టులో ఖాయంగానే కనిపిస్తోంది.
కుల్దీప్‌ను పక్కనపెట్టే అవకాశం
మొతేరా పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. అందులోనూ పింక్ బాల్ కావడంతో సంధ్యా సమయం మంచు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని తుది జట్టును ఖరారు చేయాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్‌ను గ్రీన్ వికెట్‌పై ఎదుర్కొన్న అనుభవం టీమిండియాకు లేదు. మంచు కారణంగా బంతిపై స్పిన్నర్లకు గ్రిప్ సరిగా చిక్కదనే కారణంతో పాటు బ్యాటింగ్ చేయలేని కుల్దీప్‌ను పక్కనపెట్టే అవకాశముంది.
మూడో సీమర్‌గా సిరాజ్ కంటే ఎంతో అనుభవం ఉన్న ఉమేష్ వైపే మొగ్గు చూపొచ్చు.
చివరి రెండు టెస్టులకు భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, లోకేష్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.