ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యం గురించి మనకు తెలుసు. కానీ ప్రాణాపాయస్థితిలోనూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారికే చెల్లుతుంది.
అందుకే నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానాకు అని ఓ సినీ కవి ఎప్పుడో చెప్పారు.
విషయం ఏంటంటే పాము కాటుకు గురైన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్క కాటు మందు వేశారు.
పొలంలో పనిచేస్తున్న ఓ యువకునికి కాలు దగ్గర చురుక్కుమంది. ఏంటో అని చూస్తే పాము కాటు.
భయంతో పరుగు పరుగున సర్కారు దవఖానాకు పరిగెత్తాడు. అక్కడ అవుట్ పేషంట్ స్లిప్ ఇచ్చి ఫలానా రూంలోకి వెళ్లి కూర్చో ఇంజెక్షన్ వేస్తారని చెప్పారు..
వచ్చారు.. ఇంజెక్షన్ ఇచ్చారు:
అతను అక్కడికెళ్లి కూర్చొన్న కాసేపటికి ఓ నర్సు సూది పట్టుకుని వచ్చి నీకేనా ఇంజెక్షన్ అని అడిగింది.
అవునంటూ తలూపగానే మరో మాట్లాడకుండా ఇంజెక్షన్ గుచ్చేసింది. మరో డోస్ వేసుకోవాలి మళ్లీ రావాల్సి ఉంటుందని చెప్పగా అతను ఇంటికెళ్లిపోయాడు.
ఆర్ఎంపీ డాక్టర్‌కు అనుమానం:
గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు పరామర్శ కోసం వచ్చి పలకరించారు. మరో డోస్ కోసం రావాలని చెప్పారనగానే ఆ డాక్టర్‌కు అనుమానం వచ్చింది.
పాము కాటుకు డోస్‌లు ఉండటమేంటని బాధితుణ్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వాకబు చేయగా జరిగింది తెలిసి ఉలిక్కిపడ్డారు.
సరైన మందు ఇచ్చిన ఆర్ఎంపీ:
పాముకాటుకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ బదులుగా కుక్క కాటుకు వేసే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు.
దీంతో కంగారు పడిన బాధితునికి మరోసారి వైద్యం చేసి ఉపశమనం కల్పించారు.
ప్రస్తుతం ఆ యువకుని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమన్వయ లోపం:
ఈ మొత్తం వ్యవహారంలో సర్కారు దవాఖానలో ఉండే సమన్వయం లేకపోవడం, సమాచార లోపం బట్టబయలైంది.
పేషెంట్‌కు వైద్యం చేసే ముందు సమస్య ఏంటని ఒక్క ప్రశ్న అడిగితే సమస్యే రాకపోయుండేది. అంటే పేషంట్లతో మాట్లాడరన్న విషయం తేలిపోతోంది.
అసలు ఏ పేషెంట్ అయినా ఆసుపత్రికి వస్తే మొదట ఓపీ స్లిప్ తీసుకోగానే వైద్యునికి చూపాలి. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు సూచించిన మేరకు చికిత్స అందించడం అక్కడి నర్సింగ్ స్టాఫ్ విధి.
పేషెంట్‌ను చూడని పెద్ద డాక్టర్:
ఈ కేసులో డాక్టర్ సదరు పాము కాటు పేషంట్‌ను చూడలేదు. అతనికి ఏమైంది..? ఏరకమైన వైద్యం అందించాలన్న దానిపై ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్ పాటించలేదు.
కౌంటర్‌లో ఓపీ స్లిప్ తీసుకోగానే నర్సు వచ్చి వైద్యం చేసేసింది.
ఇక్కడ వైద్యం చేసింది బాగా అనుభవమున్న సర్సు అనుకుందామన్నా అదీ కాదు. ట్రైనింగ్‌లో ఉన్న ఓ నర్సింగ్ స్టూడెంట్.
సర్కారు దవాఖానాలో తీవ్ర నిర్లక్ష్యం:
సర్కారు దవాఖానలో ఎలాంటి నిర్లక్ష్యం ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. ఈ కేసులో వెంటనే తేరుకుని ప్రత్యామ్నాయ వైద్యం చేయించుకున్నాడు అతను బతికి బట్టకట్టాడు. లేకపోతే నిండు ప్రాణం గాల్లో కలిసిపోయేది.
భద్రాద్రి స్వామి సాక్షిగా:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన జరిగింది. బాధితుడి పేరు భరత్‌రెడ్డి. ఊరు కిన్నెరసాని డ్యాం పక్కనే ఉండే రెడ్డిగూడెం.
శిరీష అనే ట్రైనీ నర్సింగ్ స్టూడెంట్ పాటు కాటుకు గురైన అతనికి వైద్యం అందించింది. నిజానికి హేమ అనే రెగ్యులర్ నర్సు వైద్య సేవలు అందించాలి.
వైద్యాధికారి నిర్లక్ష్యం:
వైద్యాధికారి సోమరాజుదొర రోగిని చూసి ఏం వైద్యం చేయాలో సూచించాలి. కానీ ఇక్కడంతా రివర్స్‌లో జరిగిపోయాయి. అసలే ఏజెన్సీ ప్రాంతం.
వచ్చేది బీదబిక్కీ గిరిజనం. వైద్యానికి సంబంధించిన విషయాలపై పెద్దగా అవగాహన లేదు. ప్రవేటు ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేనివాళ్లే ప్రభుత్వ ఆస్పత్రికి వెళతారు.
నోరు మెదపని ఉన్నతాధికారులు:
ఈ వ్యవహారంపై ఎవరూ నోరు మెదపడం లేదు. ఇక్కడి వైద్యాధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది నిర్వాకం ఫలితంగా సోమవారం మధ్యాహ్నం మరో దారుణం చోటుచేసుకుంది.
సమయానికి డాక్టర్లు అందుబాటులో లేకపోయినా సిబ్బంది డెలివరీ చేశారు. వైద్యం వికటించి శిశువు మృతిచెందడంతో బాధిత కుటుంబం ఆసుపత్రిలో ఆందోళనకు దిగింది.
షరా మామూలే:
సమాధానం చెప్పే దిక్కులేని పరిస్థితి. ఏదైనా దుర్ఘటన జరగ్గానే బాధితులు ఆందోళన చేయడం.
పోలీసులు రావడం అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం.. ఆనక మరవడం.
మళ్లీ మళ్లీ అదే పరిస్థితి పునరావృతం కావడం షరా మామూలుగా మారింది.