
యువతీయువకులు ప్రేమలో పడడం ప్రేమ విఫలమైతే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడడం వంటి ఎన్నో సంఘటనలు చూస్తున్నాం.
ప్రేమను ఒప్పుకోలేదని చంపడం లేదా ఆత్మహత్య చేసుకోవద్దని యువతకు ఎంత అవగాహన కలిగించే ప్రయత్నం చేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఒక యువతిని వరుసకు అన్నదమ్ములయ్యే ఇద్దరు యువకులు ప్రేమించారు. అయితే.. ఏమైందో తెలియదు గానీ ఆ ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుంది జిల్లాలోని కేశవ్‌పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్(23), దేవ్‌రాజ్ గుర్జర్(23) వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించారు.
ఆ యువతిని ప్రాణంగా భావించారు. ఆ ఇద్దరిలో ఎవరి ప్రేమను ఆ యువతి అంగీకరించిందో లేక ఇద్దరూ వన్‌సైడ్ లవ్ చేశారో తెలియదు.
కానీ వారు ఇద్దరూ శరీరంపై ‘ఆషా’ అని పచ్బబొట్టు పొడిపించుకున్నారు. ఏమైందో ఏమో గానీ గుడ్ల గ్రామం సమీపంలోని రైలు పట్టాలపై ఆదివారం రాత్రి ఇద్దరూ శవాలై తేలారు.
ఇద్దరి మొబైల్ ఫోన్లను పరిశీలించగా ఆ యువతి ఫొటోలే కనిపించాయి. వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా ఇద్దరూ ఆ యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
మహేంద్ర, దేవ్‌రాజ్ ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని సీఆర్‌పీఎఫ్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.