కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాల విడుదల వాయిదా పడింది.
అయితే థియేటర్లు మొన్నటి వరకు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవడంతో… సంక్రాంతి కానుకగా వరుస సినిమాలు విడుదలయ్యి అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిచినప్పటికీ “క్రాక్”తో రవితేజ చాలా రోజుల తరువాత మంచి హిట్ అందుకున్నాడు.
థియేటర్స్ లో వంద శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు జనాలు సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
రీసెంట్‌గా విడుదలైన “ఉప్పెన” అందుకు నిదర్శనం. సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.
కరోనా వలన దాదాపు 9 నెలల పాటు మూతపడ్డ థియేటర్స్ ఇప్పుడు తెరుచుకోవడం, ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తుండడంతో నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి పోటీ పడుతున్నారు.
ఈ శుక్రవారం నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. సుమంత్ నటించిన కపటధారి, అల్లరి నరేష్ నటించిన నాంది, విశాల్ నటించిన చక్ర, కన్నడ హీరో చిత్రం పొగరు థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.
మరి ఇందులో ఏ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందో వేచి చూడాలి.