అంతరిక్షం హోటల్‌లో బార్లు, ధియేటర్లు

180

ఒక‌ప్పుడు ఆర్థికంగా బ‌లంగా ఉన్న దేశాలు మాత్ర‌మే అంత‌రిక్ష ప్ర‌యోగాల్లో పాల్గొనేవి.

సాంకేతిక ప‌రిజ్ఞానం పెరిగిన త‌ర్వాత చిన్న దేశాలు కూడా ఈ స్పేస్ సైన్స్ ప్ర‌యోగాల్లో దూసుకెళుతున్నాయి.

ప్ర‌స్తుతం స్పెస్ ఎక్స్ వంటి సంస్థ‌లు కూడా సొంతంగా స్పెస్ క్రాఫ్ట్‌ను ఉప‌యోగిస్తున్నాయి.

అంత‌రిక్షంలో స్పేస్ స్టేష‌న్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఒక కంపెనీ తెలిపింది.

ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్ (OAC) అనే సంస్థ వాయేజర్ స్పేస్ స్టేషన్ పేరుతో దీన్ని నిర్మించనుంది.

ఇక్కడ నాలుగు వందల మందికి ఆతిథ్యం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వసతి కోసం లగ్జరీ హోటల్, సొంత బార్లు, సినిమా థియేటర్, లైబ్రరీ వంటి సదుపాయాలు ఉంటాయి.

హెల్త్ స్పా, జిమ్, ఎర్త్ వ్యూయింగ్ లాంజ్ కూడా ఈ స్పేస్ హోటల్‌లో ఉంటాయి. ఈ స్పేస్ హోటల్‌ 2027 నాటికి సిద్ధమవ్వనుంది.

ఈ ప్రయోగం పూర్తయితే మన గ్రహానికి బయట ఒక రెస్టారెంట్ లేదా హోటల్ ఏర్పాటు చేసిన తొలి సంస్థగా OAC కంపెనీ నిలవనుంది.

వాయేజర్ స్పేస్ హోటల్‌ నిర్మాణం 2025లో ప్రారంభం కానుంది. దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మరో రెండేళ్లు పట్టవచ్చని OAC ప్రకటించింది.

వాయేజర్ అనేది ఒక రొటేటింగ్ క్లాస్ స్పేస్ స్టేషన్ అని OAC త‌న వెబ్‌సైట్లో పేర్కొంది. దీని రొటేషన్ రేటును మార్చడం ద్వారా కృత్రిమంగా గురుత్వాకర్షణ శక్తి ఏర్పడుతుంది.

తక్కువ గురుత్వాకర్షణ శక్తిపై పరిశోధనలు చేస్తున్న జాతీయ అంతరిక్ష సంస్థలకు అంతరిక్ష కేంద్రంలో జీవితాన్ని అనుభవించాలనుకునే స్పేస్ టూరిస్ట్‌లకు ఈ స్పేస్ స్టేషన్ ఒక హోటల్‌ మాదిరిగా ఉపయోగపడనుంది.

స్పేస్‌లో జీరో గ్రావిటీ ఉంటుంది. ఈ స్పేస్ హోటల్‌లో కూడా జీరో గ్రావిటీ ఉంటే అక్కడికి వెళ్లేవారు ఎక్కువ సమయం గడపలేరు.

అందువల్ల దీంట్లో చంద్రుడి ఉపరితలంపై ఉండేంత గ్రావిటీని కృత్రిమంగా సృష్టిస్తారు. దీని కోసం స్పేస్ స్టేషన్ రొటేషన్ అవుతుంది.

ఇది కేవలం 90 నిమిషాల్లోనే భూమి చుట్టూ తిరుగుతు౦ది. రొటేటింగ్ రింగ్‌కు బయట కొన్ని పాడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

వీటిలో కొన్ని పాడ్‌లను స్పేస్ రిసెర్చ్ కోసం ప్రభుత్వ ఏజెన్సీలకు ఈ కంపెనీ అమ్మనుంది. వాయేజర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని గేట్‌వే ఫౌండేషన్ అనే సంస్థ 2012లోనే భావించింది.

ఇందుకు ఈ ఫౌండేషన్‌ 2018లో OAC సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్తలు, పైలెట్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు.

ఈ స్పేస్ హోటల్ నిర్మాణానికి అక్కడ ఒక రాత్రి గడపడానికి అయ్యే ఖర్చు వివరాలను OAC వెల్లడించలేదు.

కానీ పాత అంతరిక్ష నౌకలను ఉపయోగించడం వల్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతోనే పూర్తయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.