
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఆ రెండూ చాలా ఖర్చుతో, శ్రమతో కూడుకున్నవి.
కానీ ఓ కుర్రాడు ఆటోపై ఇల్లు కట్టేశాడు. కార్లు, వ్యాన్లను ఇల్లులాగా తయారు చేసిన వాహనాలను కారవాన్లు అంటారు.
కానీ ఇలాంటి కారవాన్‌ను ఎప్పుడూ చూసి ఉండరు. అసలు ఆటోపై ఇల్లు కట్టుకోవచ్చు అనే ఆలోచనే చాలా గొప్పది.
ఈ ఆటో హౌస్‌ను చూసి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు.
ఇలాంటి ఇల్లు కూడా ఉంటుందా అని చిత్రంగా చూశారు. దీన్ని తయారుచేసిన ఆర్కిటెక్ట్‌ని కలవాలనుకుంటున్నట్లు ట్విట్టర్‌లో రాశారు.
మరి ఆ ఆర్కిటెక్ట్ పేరు అరుణ్ ప్రభు NG. ఇతను చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్. ఈ ఆటో హోమ్ ఎంతో మందికి నచ్చుతోంది.
ఎందుకంటే అంత తక్కువ చోటులోనే ప్రభు… బెడ్ రూమ్, కిచెన్, బాత్‌రూమ్ అన్నీ కట్టేశాడు. నెటిజన్లు దీన్ని చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా తన కోసం ఇలాంటిది ఒకటి చేసి పెట్టమని కోరారు. నిజానికి ప్రభు దీన్ని ఎప్పుడో చేశాడు. ఆనంద్ మహీంద్రా కాస్త ఆలస్యంగా దీన్ని చూశారు.
అయితేనేం ఆ ఆర్కిటెక్ట్ వివరాలు తెలిసేలా తనకు సాయం చెయ్యాలని ఆనంద్ మహీంద్రా నెటిజన్లను కోరారు. అరుణ్ ప్రభు మరిన్ని పెద్ద ప్రాజెక్టులను డిజైన్ చెయ్యాలని ఆనంద్ మహీంద్రా కోరారు.
బొలెరో లాంటి పికప్ వాహనాలను కూడా కారవాన్‌లుగా మార్చాలన్నారు. అలా చెయ్యాలనుకుంటే తమను కలవాలని కోరారు.ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
లైక్స్, కామెంట్స్ తుఫానులా వస్తున్నాయి. చాలా మంది ఆటో హోమ్ అదిరిందని ప్రభును మెచ్చుకుంటున్నారు. అరుణ్ తమిళనాడులోని నమకల్ ప్రాంతానికి చెందిన వాడని ఓ నెటిజన్ తెలిపాడు.
ఆ ఆటోపై ఇంటిని అరుణ్ జస్ట్ రూ.1 లక్ష ఖర్చుతోనే తయారు చేసినట్లు మరో యూజర్ తెలిపాడు. సాధారణంగా కేరళలో తయారయ్యే పెద్ద కారవాన్‌లు రూ.16 లక్షల దాకా ఉంటాయి.
ప్రభు చేసినది సామాన్య, మధ్య తరగతి వారు కొనుక్కునేందుకు వీలుగా ఉండటం ఆనందించదగ్గ విషయం. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా లక్షలు కావాలి.
అలాంటిది ఇలా దేశమంతా తిరిగేందుకు వీలుగా ఉండేలా ఆటోపై ఓ ఇంటిని నిర్మించడం గొప్ప విషయం అంటున్నారు నెటిజన్లు.
మీరూ ఈ కింది వీడియోలో ఆ ఇంటిను చూసేయండి