పెద్దాయ‌న‌కు రూ.80 కోట్ల కరెంట్ బిల్లు

214

కోట్ల రూపాయ‌ల క‌రెంట్ బిల్లును మీరెప్పుడైనా క‌ట్టారా? సాధార‌ణంగా పెద్ద పెద్ద కంపెనీల‌కు మాత్ర‌మే ల‌క్ష‌ల్లో లేదా కోట్ల‌లో క‌రెంట్ బిల్లు వ‌స్తుంది.

కానీ మ‌హారాష్ట్ర‌లో ఓ పెద్దాయ‌న‌కు అక్ష‌రాలా రూ. 80 కోట్ల క‌రెంట్ బిల్లు వ‌చ్చిందంట‌. దాన్ని చూడ‌గానే పాపం ఆ ముస‌లాయ‌న‌కు గుండె ఆగినంత ప‌నైంది.

హై బీపీ రావ‌డంతో ఆ పెద్దాయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ వార్త ఆ రాష్ట్రంలో దావాన‌లంలా వ్యాపించింది.

వెంట‌నే విద్యుత్ అధికారులు హుటా హుటిన అక్కడికి చేరుకుని బిల్లున ప‌రిశీలించారు. ఇది నిజం కాదని.. సాంకేతిక స‌మస్య అని ఆ అధికారులు చెప్పారు.

దీంతో ఆ పెద్దాయ‌న బీపీ కాస్త త‌గ్గిందంట‌. వివ‌రాల్లోకి వెళితే.. నిర్మల్ గ్రామంలో నివసిస్తున్న గణపత్ నాయక్ అనే వృద్ధుడు రైస్ మిల్లు నడుపుతున్నాడు.

మిల్లుకు వచ్చిన కరెంట్ బిల్లును చూసి హడలిపోయాడు. అతడి బీపీ అమాంతంగా పెరిగిపోయింది.

నాయక్ హార్ట్ పేషెంట్ కావడంతో కుటుంబికులు హుటాహుటిన అతడిని హాస్పిటల్‌కు తరలించారు. జీవితాంతం కష్టపడినా ఆ కరెంటు బిల్లు చెల్లించలేమని నాయక్ కుటుంబికులు అధికారులకు మొర పెట్టుకున్నారు.

మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రీబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL) అధికారులు ఆ బిల్లు పరిశీలించారు. అది తమ సిబ్బంది తప్పదమేనని తెలిపారు.

బిల్లులో ఆరు అంకెలకు బదులు 9 అంకెలు వేశారని, అందుకే అంత మొత్తం చూపించిందని అధికారులు పేర్కొన్నారు. తప్పులు సరిచేసి మరొక బిల్లును అందిస్తామని తెలిపారు.

నాయక్ మనవడు నీరజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ కరెంటు బిల్లు చూడగానే షాకయ్యాం. మొత్తం జిల్లా ఉండే వాళ్లంద‌రి బిల్లు మా చేతికి ఇచ్చారేమో అనుకున్నాం.

వివరాలు చూసుకుంటే అది మా బిల్లే. దీంతో మాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బోర్డు బకాయిలు వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. రూ.80 కోట్లు ఎలా చెల్లించగలమనే ఆందోళన క‌లిగింది’ అని తెలిపాడు.

భారీ మొత్తంలో కరెంటు బిల్లులు రావడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది ఆగస్టు నెలలో నాగపూర్‌లో నివ‌సించే 57 ఏళ్ల వ్యక్తికి రూ.40 వేలు కరెంటు బిల్లు వచ్చింది.

దాన్ని చూడగానే తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.