పాక్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌ లేనట్టే?

379
World Cup match

ఇంగ్లండ్, వేల్స్ వేదికగా త్వరలో జరిగే ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరిగే అవకాశాలు లేనట్టేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖుడొకరు జాతీయ మీడియాకు వెల్లడించారు. భారత ప్రభుత్వం అంగీకరించని పక్షంలో దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒక వేళ ఈ టోర్నమెంటులో పాకిస్తాన్‌తో భారత్ ఆడేందుకు అంగీకరించకపోతే… మ్యాచ్‌లో పాల్గొనక పోయినా పాకిస్తాన్‌కు పాయింట్లు దక్కే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. కాగా ఈ వ్యవహారంపై బీసీసీఐ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో సంప్రదింపులు జరపలేదని సదరు ఉన్నతాధికారి పేర్కొన్నారు.




 

‘‘మరో మూడు నెలల్లో జరగనున్న వరల్డ్‌ కప్‌కు ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఐసీసీ కూడా చేయడానికేం లేదు. వరల్డ్ కప్‌కు ముందు ఎప్పుడైనా భారత ప్రభుత్వం ఈ మ్యాచ్ ఆడవద్దని చెబితే మేము ఆడడానికి లేదు. అయితే మనతో తలపడకపోయినా పాకిస్తాన్ పాయింట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదేగనుక ఫైనల్ మ్యాచ్ అయితే… మ్యాచ్ ఆడకుండానే పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలుచుకుంటుంది…’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ నెల 27న దుబాయ్‌లో ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల గురించి చర్చించే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలకు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, సెక్రటరీ అమితాబ్ చౌదరి పాల్గొననున్నట్టు తెలుస్తోంది. కాగా ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య కొనసాగుతున్న వ్యవహారాన్ని తాము పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్సన్ పేర్కొన్నారు. అయితే ప్రపంచ కప్‌లో ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగబోవట్లేదన్న దానిపై ఇంకా తమకు సంకేతాలు అందలేదని ఆయన అన్నారు.



ఈ నెల 14న 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ దారుణం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ చెబుతున్నప్పటికీ… తమకు సంబంధం లేదని దాయాది దేశం బుకాయిస్తోంది. దాడి చేసింది తామేనని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించినప్పటికీ… భారత్ ఆధారాలు చూపించాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొడంపై మరింత ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్నక్రికెట్ సంబంధాలు ఇప్పుడు మరింత క్షీణించాయి. బెంగళూరు, రాజస్థాన్‌లతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు ఇప్పటికే… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా తమ స్టేడియాల్లో ఉన్న పాక్ క్రికెటర్ల ఫొటోలను తొలగించాయి.