ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమిళనాడులో 1946 ఫిబ్రవరి 20వ తేదీన విజయనిర్మల జన్మించారు. విజయ నిర్మల నటుడు సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి. విజయనిర్మలకు నరేష్ ఒక్కడే సంతానం. ఏడేళ్ల వయస్సులో బాలనటిగా తమిళచిత్రం మత్స్యరేఖతో అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయస్సులో పాండురంగమహత్యం చిత్రంలో తెలుగులో విజయనిర్మల పరిచయం అయ్యారు.
సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్‌స్టార్ కృష్ణతో విజయనిర్మల నటించారు. కృష్ణతో కలిసి 47 చిత్రాల్లో ఆమె నటించారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన అత్యధిక చిత్రాల్లో హీరోగా కృష్ణ నటించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ నిర్మల గిన్నిస్ రికార్డులో సాధించారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళంలో రెండువందలకు పైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కు పైగా చిత్రాలను నిర్మించారు.