ఒక కుక్కపిల్ల ఎదురు చూస్తోంది.. ఎవరో వస్తారని కాదు..! తన యజమాని వస్తారని, తనతోపాటు తీసుకెళ్తారని..! ఆహార అన్వేషణను కూడా మానేసి ఉన్నదగ్గరే కదలకుండా ఉండిపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన మిస్సిసిపీలోని బ్రూక్‌హావెన్‌లో కనిపించింది . ఒక వ్యక్తి తనకు అవసరం లేదని భావించిన కుర్చీ, టీవీలను రోడ్డు పక్కన పాడేశాడు. ప్రాణం లేని వస్తువులతో పాటు అతను పెంచుకుంటున్న కుక్కపిల్లను కూడా కుర్చీలో వదిలేసి వెళ్లిపోయాడు.
ఈ విషయాన్ని గమనించిన జంతు నియంత్రణ అధికారిని శారన్ నార్టన్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా ఆ న్యూస్ వైరల్‌గా మారింది. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిని ఉద్దేశించి ‘కుక్కపిల్ల కుర్చీని వదలటానికి కూడా భయపడుతోంది. మీరు తిరిగి వస్తారేమోనని చూస్తూ తిండి కూడా మానేసి కుర్చీనంటిపెట్టుకుని కూర్చుంది. ఇలాగైతే ఆ కుక్కపిల్ల ఆకలితో అలమటిస్తూ.. చిక్కి శల్యమై చనిపోతుంది. దాన్ని అలా రోడ్డుపై వదిలేసి వెళ్లినందుకు సిగ్గనిపించట్లేదా..?’ అంటూ నార్టన్ పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా కుక్కపిల్లను వదిలేసిన యజమానిపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ఎంతో దీనంగా చూస్తున్న కుక్కపిల్ల ఫోటోలను చూసి సోషల్ మీడియా చలించిపోయింది. మూగజీవిని రోడ్డు పక్కన పాడేయడానికి మనసెలా వచ్చిందంటూ జంతు ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. దానికున్న విశ్వాసంలో కొంతభాగమైనా ఆ యజమానికుంటే బాగుండేది అంటూ అభిప్రాయపడుతున్నారు.