కాఫీ తాగ‌డ‌మే ఉద్యోగం.. చేస్తారా?

381

చాలా మంది కాఫీ తాగ‌డంతో త‌మ రోజును ప్రారంభిస్తారు. నిద్ర లేవ‌గానే కాఫీ కావాలంటారు.

కొంత మంది బెడ్‌పై ఉండ‌గానే కాఫీ తాగుతారు.

కాఫీని ఇష్ట‌ప‌డ‌ని వారు తాగ‌ని వారు చాలా త‌క్కువే అని చెప్పాలి.

ఉద్యోగం, స‌ద్యోగం లేక ఇబ్బంది ప‌డుతున్న ఈ రోజుల్లో కాఫీ తాగ‌డ‌మే ఉద్యోగమంటే ఎలా వుంటుంది.

అలాంటి కాఫీ తాగే ఉద్యోగాన్ని మేము మీ ముందుకు తెస్తున్నాం.

సాధారణంగా మనం పని చేస్తూ కాస్త బ్రేక్ కోసం కాఫీ తాగుతుంటాం. కానీ కాఫీ ఎంజాయ్ చేయటమే ఈ ఉద్యోగం.

కాఫీ ఘుమఘుమలు, కాఫీ రుచిని ఆద్యంతం ఆస్వాదించి సిప్పుల మీద సిప్పులు లాగించే ఈ కొలువు భలే ఉంది కదూ.

కానీ ఇది ఆషామాషీ పని మాత్రం కాదు.

కప్పుల కొద్దీ కాఫీలు లాగించేయటం కాదు కానీ ఇది ఓ సైన్స్. ఈ శాస్త్రంలో మీకు నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం వస్తుంది.

పైపెచ్చు పెద్ద పెద్ద కాఫీ కంపెనీలు ఇలా నిపుణులను ఎంపిక చేసుకుని వారి సలహాలతో తమ ఉత్పత్తుల్లో మార్పులు చేసుకుంటాయి.

ఎప్పటికప్పుడు వెరైటీ కాఫీలను కస్టమర్లకు అందించేందుకు బోలెడంత కసరత్తు చేస్తుంటాయి.

కాఫీ గింజలు, కాఫీ పొడి, కాఫీ డికాషన్, పలు పరీక్షలు పాసైన కాఫీని మనం స్టార్ బక్స్, బరిస్టా, కేఫ్ కాఫీ డే వంటి చోట్ల తాగుతాం.

తెరవెనుక ఇంత తతంగంలో కీలక పాత్ర పోషించేది మాత్రం కాఫీ టేస్టర్.

ఈ టేస్టర్ అనే వ్యక్తి ఇచ్చే గ్రేడ్స్ ఆధారంగా భిన్న రుచుల కాఫీలు మనల్ని పలకరిస్తాయి.

మనలో చాలామందికి వైన్ టెస్టర్ల గురించి తెలుసు అచ్చం అలాంటిదే ఈ కాఫీ టేస్టర్‌.

కాఫీ వెరైటీల్లో కన్సిస్టెన్సీ ఉండాలంటే ఇలాంటి సర్టిఫికెట్లు తప్పనిసరి.

క్యాపచ్చినో కాఫీ వెరైటీని మీరు ఎక్కడ ఏ కాఫీ డేలో తాగినా ఎప్పుడు తాగినా ఒకే రుచి క‌లిగి ఉంటుంది. దీనికి కారణం కన్సిస్టెన్సీనే.

ఎంత పాలు, క్రీము చేర్చాలి, ఎన్ని డిగ్రీల వద్ద వేడిచేయాలి వంటివన్నీ ఫైనల్‌గా నిర్ధారణకు వచ్చేది కాఫీ టేస్టర్ వద్దనే.

ఇక ఇలాంటి టేస్టర్ల విషయానికి వస్తే వారు ఎలా పడితే అలా తినకూడదు.

కాఫీని టేస్ట్ చేసేందుకు కనీసం రెండు గంటల ముందు నుంచి వీరు ఏమీ తినకుండా ఉండాల్సిందే.

వీరిలో చాలామంది నిద్రలేవగానే ఖాళీ కడుపుతో కాఫీ లాగించి దాని రంగు రుచి వాసన ఎలా ఉందో రిపోర్ట్ తయారు చేస్తారు.

వీరికి జీతం కూడా లక్షల్లో ఉంటుంది.

ఎవరుపడితే వారు కాఫీ టేస్టర్లు కాలేరు. ముందు వారికి కాఫీ అంటే చాలా ఇష్టమై ఉండాలి.

కాఫీలో కొత్త రుచులను ట్రై చేయాలనే తపన ఉండాలి. కాఫీ పంట మొదలుకొని కాఫీ తయారీ వరకు వీరికి అవగాహన అవ‌స‌రం.

చిన్నప్పటి నుంచీ కాఫీ అంటే ఇష్టపడేవారే ఈ ప్రొఫెషన్లో నిలదొక్కుకోగలరు.

స్పెషాలిటీ కాఫీ అసోసియేషన్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కోర్సులు కూడా ఉన్నాయి.

వాటిని పూర్తి చేస్తే మీరు సర్టిఫైడ్ కాఫీ టేస్టర్ అవ్వచ్చు. ఇలా టేస్ట్ చేసే క్రమంలో రూం టెంపరేచర్ 22-26 డిగ్రీల మధ్య ఉండాలి.

లేదంటే కాఫీ టేస్టు పూర్తిగా మారిపోతుంది.

వీరికి కాఫీ గింజలను రోస్ట్ చేయటం బాగా తెలిసి ఉండాలి. రోస్టింగ్ ఏమాత్రం తేడా వచ్చినా కాఫీ టేస్ట్ పూర్తిగా మారిపోతుంది.

మనదేశంలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా చిక్ మాళూరులోని సెంట్రల్ కాఫీ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ బెంగళూరులోని బెంకీ బ్రూయింగ్ టూల్స్ విశాఖలోని అరకులో ఈ కోర్సులు చేసే అవకాశం ఉంది.

ఇటీవల కాలంలో మనదేశంలో కాఫీ రుచులకు ఫిదా అయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రంగంలో బాగా అందిపుచ్చుకునే అవ‌కాశ‌ముంది.