భారతీయ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌

367

కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ నర్సులు ప‌నిచేస్తున్నారు. కొన్ని దేశాల్లోని వృద్ధాశ్రమాల్లోనూ చాలామంది నర్సులు ఉద్యోగాలు చేస్తున్నారు.

భారతీయ నర్సులు సహనం, షార్స్ స్కిల్స్ క‌లిగి ఉండ‌టమే కాకుండా అంకితభావంతో జాగ్రత్తగా చూసుకునే విధానం కలిగి ఉంటారని పేరుంది.

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా డిమాండ్ పెరిగింది. అయితే ప్రపంచదేశాలు ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప‌నిలో ఉన్నాయి.

భవిష్యత్తుల్లో వచ్చే మహమ్మారిలను తట్టుకునేలా తమ ఆరోగ్యవ్యవస్థలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భారతీయ నర్సుల డిమాండ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది.

కరోనాకి ముందు కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓవర్సీస్ డెవలప్ మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ కన్సల్టెంట్స్ (ODEPC) ప్రతినెలా దాదాపు 40మంది నర్సులను విదేశాలకు పంపించేది.

అయితే గత నెలలో ఏకంగా 6 రెట్లు అధికంగా 253మంది నర్సులను విదేశాలకు పంపింది. ఇందులో యూఏఈకి ముఖ్యంగా దుబాయ్‌కి 153 మందిని, బ్రిటన్‌కు 50మందిని పంపింది.

మిగిలిన 50మంది నర్సులను సౌదీ అరేబియా మరియు కొన్ని యూరప్ దేశాలకు పంపించినట్లు ODEPC ఎండీ అనూప్ తెలిపారు.

వందల సంఖ్యలో ఇంకా నర్సులను రిక్రూట్ చేసుకున్నాయని ఆయ‌న తెలిపారు. వీసా ఫెసిలిటీ అందుబాటులోకి రాగానే వీరందరూ విదేశాలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

ODEPC తెలిపిన వివరాల ప్రకారం గతంలో కంటే ఇప్పుడు నర్సుల కోసం దుబాయ్ ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తోంది.

గతంలో దుబాయ్‌లో 4,000 – 5,000 దిరామ్స్(రూ.80,000-రూ.1లక్ష) వరకు నర్సులకు జీతం లభించేది. ఇప్పుడు 10,000 – 12,000 (2-2.4లక్షలు) వరకు నర్సులకు జీతం లభిస్తోంది.

భారతీయ నర్సులు కావాలని ఐర్లాండ్, మాల్టా, జర్మనీ, నెదర్లాండ్ మరియు బెల్జియం దేశాలు మన దేశాన్ని కోరుతున్నాయి.

తొలిసారిగా బెల్జియం భారతీయ నర్సులను నియమించుకుంటోంది. దీనిపై చర్చలు నడుస్తున్నాయని వారి ఆఫర్ చాలా ఎట్రాక్టివ్‌గా ఉందని అనూప్ అంటున్నారు.

కేవలం భాష సమస్య‌ను పరిష్కరించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని అనూప్ తెలిపారు.