ఆర్మీ మాజీ సిబ్బందికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు

260

కేంద్ర పారిశ్రామిక రక్షణ బలగాలు ( CISF )‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిస్‌లో దాదాపు 2 వేల ఉద్యోగాల్ని భర్తీ చేస్తోంది.

ఇందులో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాలున్నాయి. మాజీ ఆర్మీ సిబ్బంది మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్ధులు మార్చ్ 15, 2021 లోగా దరఖాస్తుల్ని సీఐఎస్ఎఫ్ యూనిట్‌కు మెయిల్ చేయాలి.

దేశవ్యాప్తంగా వివిధ సీఐఎస్ఎఫ్ యూనిట్లలో ఖాళీగా ఉన్న 2 వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 1326 కానిస్టేబుల్ పోస్టులు, 424 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, 187 ఏఎస్ఐ పోస్టులు, 63 ఎస్ఐ పోస్టులున్నాయి.

అభ్యర్దులకు కావల్సిన అర్హత, జీతభత్యాలు , ఎంపిక విధానం వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఎస్ఐ పోస్టుకు నెలకు 40 వేల రూపాయలు జీతం కాగా, ఏఎస్ఐ పోస్టుకు 35 వేల రూపాయలు చెల్లిస్తారు.

ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు 30 వేలు, కానిస్టేబుల్ పోస్టుకు 25 వేల రూపాయలు వేతనం ఉంటుంది. ప్రభుత్వ వైద్యుడితో మెడికల్ ఫిట్నెస్ సర్ఠిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాలకు 170 సెంటీమీటర్లు ఎత్తు, ఛాతీ 80 సెంటీమీటర్ల వెడల్పు ఉండాలి. ఎస్టీ కేటగరీకు చెందినవారికి ఎత్తు 162.5 సెంటీమీటర్లు కాగా.. గర్హ్‌వాల్, కుమాన్, హిమాచల్ ప్రదేశ్, గూర్ఖాస్, దోగ్రాస్, మరాఠాస్, కాశ్మీర్ వ్యాలీ, లేహ్ మరియు లడాఖ్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిమ్ ప్రాంతాలకు చెందిన వారికి 165 సెంటీమీటర్ల ఎత్తు ఉంటే చాలు.

ఛాతీ విషయంలో ఎస్టీ కేటగరీ వారికి 3 సెంటీమీటర్లు మినహాయింపు ఉంటుంది. వయస్సు 50 సంవత్సరాల వరకూ ఉండవచ్చు.