అనుభవ్‌ సిన్హా కొత్త చిత్రం ‘ఆర్టికల్‌–15’

258
new bollywood movie article 15

భారత దేశంలోని ఏ పౌరుడి పట్ల కూడా జాతి, మత, కుల, లింగం, ప్రాంతంపరంగా విపక్ష చూపించకూడదంటూ రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌–15’ సూచిస్తోంది. అయినప్పటికీ దేశంలో ఈ పలు రకాల వివక్షలు, వాటి పేరిట దారుణాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి వివక్ష కారణంగానే ఉత్తరప్రదేశ్‌లోని బదాన్‌ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరిపోసుకొని మరణించిన యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని అనుభవ్‌ సిన్హా బాలీవుడ్‌లో ‘ఆర్టికల్‌–15’అనే టైటిల్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరిపోసుకుని చనిపోగా మరో సోదరి అదశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ఈ చిత్రం జూన్‌ 28వ తేదీన విడుదల కానుంది . ‘ఇస్లామోఫోబియా (ఇస్లాం మతస్థులంటే భయం)’ను ఇతివృత్తంగా తీసుకుని అనుభవ్‌ సిన్హా ఇంతకుముందు తీసిన ‘ముల్క్‌’ (2018) చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విషయం తెల్సిందే. నిజాయితీకి దగ్గరగా తీసిన ‘ఆర్టికల్‌–15’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉన్నట్లు ‘ట్రేలర్‌’ను చూస్తే అర్థం అవుతుంది.

వివక్షతో దళితులపై సమాజంలో జరుగుతున్న దారుణాల గురించి పలువురు దర్శకులు తమదైన శైలిలో చిత్రాలను తీసారు. వాటిలో మరీ వాస్తవానికి దగ్గరగా కనిపించే చిత్రం 1980లో గోవింద్‌ నిహ్లాని దర్శకత్వం వహించిన ‘ఆక్రోష్‌’.ఆక్రోష్‌ అంటే ఇక్కడ 1980లో వచ్చిన ‘ఆక్రోష్‌’నే పరిగణించాలి. 2010లో ప్రియదర్శన్‌ తీసిన మరో ఆక్రోష్‌ వచ్చింది. అజయ్‌ దేవగన్, అక్షయ్‌ఖన్నా నటించిన ఆ చిత్రాన్ని 1998లో విడుదలైన ‘మిసిసిపీ బర్నింగ్‌’ స్ఫూర్తితో తీశారు. ఈ చిత్రం కూడా యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్నదే. పత్రికల్లో వచ్చిన ఓ సంఘటన ఆధారంగా విజయ్‌ టెండూల్కర్‌ ఓ నాటకం రాయగా, దాన్ని గోవింద్‌ నిహ్లాని తెరకెక్కించారు. శ్యామ్‌ బెనగళ్‌ దగ్గర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన గోవింద్‌ నిహ్లానికి దర్శకుడిగా మొట్టమొదటి చిత్రం ఇదే. అమ్రేషిపురి, ఓంపురి, నసీరుద్దీన్‌ షా, స్మితా పాటిల్‌ నటించిన ఆక్రోష్‌ సినిమాకు పలు అవార్డులు వచ్చాయి. సినిమాలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ముఖకవళికతో ప్రేక్షకులను మెప్పించిన ‘ఉత్తమ’ నటుడు ఓంపురి. గుండెలో అగ్ని పర్వతాలు బద్దలవుతుంటే వాటి మంటలు ముఖం మీద ప్రతిఫలించినట్లుగా కోపోద్రిక్తుడుగా అందులో ఓంపురి కనిపిస్తాడు.

తాడిత పీడిత జనం మీద తీసిన గతకాలపు సినిమాలు పీడితులు తిరుగుబాటు చేసినట్టో, దారుణాలకు తెగబడ్డట్లో చూపుతూ ముగింపు ఇచ్చారు. కానీ ఆక్రోష్‌లో ఊహించని షాకింగ్‌ ముగింపు ఉంటుంది. భార్య ఆత్మహత్యకు కారకుడన్న కేసులో నిందితుడైన దళితుడు లాహన్య బీకు (ఓంపురి) తన తండ్రి అంత్యక్రియలకు పోలీసుల కాపలా మధ్య హాజరవుతాడు. అక్కడ తన భార్య ఆత్మహత్యకు కారణమైన అగ్రవర్ణ కామాంధుడు తన చెల్లిలిని కూడా కామం కళ్లతో చూస్తున్నాడని గ్రహించిన ఓంపురి అక్కడ ఉన్న గొడ్డలిని తీసుకొని చెల్లిని నరికేస్తాడు. అణచివేతకు గురవుతున్న ఓ దళితుడి కోపం శత్రువుపై కాకుండా తన అశక్త బతుకులపైనే ఉంటుందన్న కోణంలో గోవింద్‌ నిహ్లాని క్లైమాక్స్‌ను తీశారు.