బీర్ తాగనివ్వలేదని విడాకులు అడిగిన భార్య

314
asking to drink beer

అహ్మదాబాద్‌లో ఓ వింత విడాకుల కేసు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ భార్య పెళ్లైన కొద్ది రోజులకే భర్తకు షాకిస్తూ తన అభిరుచిని భర్త ముందుంచింది. దానికి నిరాకరించాడని విడాకులు కావాలంటూ భర్తపై బెదిరింపులకు దిగింది. తనకు రూ.20లక్షలు భరణంగా చెల్లించాలంటూ పంచాయితీ పెట్టింది.

నిర్ణయ్‌నగర్‌కు చెందిన యువకుడికి గతేడాది మధుపూర్‌కు చెందిన యువతితో వివాహమయింది. కొద్ది రోజుల క్రితం ఈ జంట ఇండోనేషియాలోని బాలీకి జాలీ ట్రిప్‌కు వెళ్లారు. హోటల్ రూమ్‌లో బీరు తాగుదామని భర్తతో చెప్పింది. ఆమె వింత కోరిక విన్న భర్త షాక్ తిన్నాడు. తాగొద్దని భార్యకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఆమె మాత్రం ససేమీరా అని ఒప్పుకోలేదు. బీరు తాగాల్సిందేనంటూ పట్టుబట్టింది. ‘నాకు బీర్ ఇవ్వడం లేదు. నువ్వు వైవాహిక జీవితం ఎలా కొనసాగిస్తోవో నేను చూస్తా. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ముందు నుంచి ఇష్టం లేదు. నువ్వు నాలాగా లేవు. నిన్ను పెళ్లి చేసుకుని మోసపోయాను’ అని తిట్టిపోసింది.

నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వెనక్కు తగ్గలేదు. ఈ కారణంతో భర్త మిట్టల్ పై కోపంతో హోటల్‌లో రెచ్చిపోయింది. హోటల్‌ గది తలుపుల్ని బాదుతూ అందర్నీ పిలిచి రచ్చ చేసింది. తన భర్త బీరు తాగనివ్వడం లేదని.. ఈ వ్యక్తితో కలిసి ఉండటం కుదరదని గొడవకు దిగింది. విడాకులు ఇవ్వాల్సిందేనంటూ అక్కడే పంచాయితీ పెట్టింది. పరువు కాపాడుకోవాలనే ప్రయత్నంలో మెల్లిగా ఆమెకు సర్ధిచెప్పి తిరిగి అహ్మదాబాద్ తీసుకొచ్చాడు భర్త.

ఇంటికిరాగానే భార్య సామాను మొత్తం సర్ధుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త నుంచి విడాకులు కావాలంటూ బెదిరింపులకు దిగుతోంది. భరణం కింద రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. అలా చేయకపోతే అత్తింటిపై తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తోందట. ఇన్ని రోజులు పరువు పోతుందని భావించిన బాధితుడు.. తన బంధువులు, స్నేహితులకు చెప్పి బాధపడ్డాడట. చివరికి మిట్టల్ అహ్మదాబాద్‌లోని వాడాజ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పరిష్కారం కోరాడట.