
వధువు కట్నం తీసుకోవడమేంటని అనుకుంటున్నారా? అవును! ఇది నిజమే. పూర్వం కన్యాశుల్కం అని ఉండేది.
అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కొంత డబ్బు ఇచ్చేవారు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఇంత కాలం పెంచి పెద్ద చేసినందుకు.
అంతేకాదు ఆ అమ్మాయిని తన తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తున్నందుకు నష్టపరిహారంగా ఈ సంప్రదాయం ఉండేది. కానీ రాను రాను కన్యాశుల్కం అన్న పదాన్ని వరకట్నంగా మార్చేశారు.
అబ్బాయికి డబ్బులివ్వాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు. సాధారణంగా వధువు తరపువారు వరుడికి వరకట్నం ఇస్తారు.
కానీ కొన్ని ప్రాంతాల్లో ఆయా మతాల సంప్రదాయం ప్రకారం వరుడి తరఫు వారు వధువుకు కట్నం ఇస్తారు.
అటువంటి ఓ పెళ్లిలో వధువు కట్నంగా డబ్బులు వద్దు..పుస్తకాలు కావాలని చెప్పింది. కట్నం డబ్బులకు బదులుగా పుస్తకాలను కొనివ్వమని చెప్పింది.
ఆ వధువు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన యువతి కావటం మరో విశేషం. సాధారణంగా మైనార్టీ సామాజిక వర్గం కుటుంబాల్లో అమ్మాయిలకు ఎటువంటి స్వేచ్ఛా ఉండదు.
పెద్దలు చేసుకోమన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. కానీ కట్నానికి బదులుగా పుస్తకాలను కట్నంగా తీసుకోవాలన్న వధువు నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఈ ఆదర్శనీయమైన పెళ్లి మనమూ తెలుసుకుందాం. భారతదేశంలో ఆయా సామాజిక వర్గాలు ఆయా ప్రాంతాల సంప్రదాయాలను బట్టి పెళ్లిళ్లు జరుగుతుంటాయి.
పెళ్ళిలో కట్నం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికి కన్యాశుల్కం అమలులో ఉన్నది. దాన్నే ఆ ప్రాంతంలో మోహోర్ అని పిలుస్తారు.
బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా కళ్యాణి విశ్వవిద్యాలయంలో చదువుతున్న మొయినా ఖాతూన్ అనే యువతి ఇటీవలే వివాహం చేసుకుంది. ఈ వివాహం టాక్ ఆఫ్ ది స్టేట్‌గా నిలిచింది.
మైనార్టీ ఆధిపత్యం ఉండే ఏరియాలో 24 ఏళ్ల వధువు తనకు వరుడు ఇచ్చే కట్నం ‘మహర్’ (బెంగాలీలో ‘మోహోర్’) వద్దని దానికి బదులుగా పుస్తకాలు కావాలని కోరింది.
అది విన్న వరుడి కుటుంబం ఆశ్చర్యపోయింది. ఆ తరువాత అర్థం చేసుకుని కాబోయే కోడలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది.
అలా ఆమె కోరిన పుస్తకాలను బహుమతిగా అందించి గత సోమవారం (ఫిబ్రవరి 1,2021) మొయినా సొంత గ్రామమైన కిద్దేర్పోర్‌లో వివాహం జరిపించారు.