పదిలమైన కెరీర్ అందించే గ్రామీణ బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా పది వేలకుపైగా పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తున్న ఐబీపీఎస్.. ఈ సంవత్సరం కూడా రీజనల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీస్) క్లర్క్ నుంచి సీనియర్ మేనేజర్ స్థారుు వరకు.. భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 1470 ఖాళీలు ఉండటం మన విద్యార్థులకు కలిసొచ్చే అంశం. మంచి వేతనాలు, గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అవకాశం, సొంత రాష్ట్రంలోనే సేవలందించే వీలుండటంతో బ్యాంకింగ్ ఔత్సాహికులకు ఈ నోటిఫికేషన్ సువర్ణావకాశంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పల్లెబ్యాంకుల్లో పోస్టులు, అర్హతల వివరాలు, పరీక్ష తీరు, ప్రిపరేషన్ గెడైన్స్ తెలుసుకుందాం…
పల్లె బ్యాంకులు..పదివేల కొలువులు
ఖాళీల వివరాలు :
మొత్తం పోస్టులు: 10,190
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: 1470
అర్హతలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), స్కేల్1 (అసిస్టెంట్ మేనేజర్), ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు), సీనియర్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాషతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) పోస్టుల భర్తీలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీసైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులకు బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో రెండేళ్ల అనుభవం; సీనియర్ మేనేజర్ పోస్టులకు అయిదేళ్ల అనుభవం ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిగ్రీ/పీజీతోపాటు సంబంధిత రంగంలో ఏడాది/రెండేళ్ల అనుభవం తప్పనిసరి. నిబంధనల మేరకు వయసు ఉండాలి.
ప్రిపరేషన్
అసిస్టెంట్, స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగాలకు ఎక్కువ మంది పోటీపడతారు. అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉమ్మడిగా ఉండే రీజనింగ్, క్వాంటిటేటివ్ సెక్షన్లకు సన్నద్ధమవ్వాలి. స్కేల్1 పరీక్ష స్థాయిలో ప్రిపేరైతే అసిస్టెంట్ పరీక్షకు కూడా ఉపయోగపడుతుంది.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
బ్యాంకింగ్ పరీక్షల్లో తక్కువ సమయంలో కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలను వేగంగా చేయగలిగేలా సన్నద్ధమవ్వాలి. 1-30 వరకు ఎక్కాలు, 50 వరకు వర్గాలు – వర్గమూలాలు, 30 వరకు ఘనమూలాలు నేర్చుకోవాలి.
ముఖ్య చాప్టర్లు: నిష్పత్తులు, శాతాలు, సగటు వంటి కీలక అధ్యాయాలను బాగా అర్థం చేసుకోవాలి. ఈ మూడు విభాగాలపై పట్టు సాధిస్తే తేలిగ్గానే కటాఫ్ మార్కులు పొందొచ్చు. ఓవరాల్ కటాఫ్ మార్కులు సాధించడానికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ముఖ్యం.
పరీక్షల్లో సింప్లిఫికేషన్/అప్రాక్షిమేషన్ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా కనిపిస్తున్నాయి.
నంబర్ సిరీస్ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ప్రాక్టీస్ ప్రధానం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి తప్పనిసరిగా ప్రిలిమ్స్, మెయిన్స్ లో 5 ప్రశ్నల వరకు ఉంటున్నాయి. నంబర్లపై పట్టు ఉంటే వీటికి సమాధానాలు రాబట్టడం సులువు.
ఎక్కువ వెయిటేజీ ఉన్న విభాగం డేటా ఇంటర్‌ప్రిటేషన్. నిష్పత్తులు, శాతాలు, సగటు అధ్యాయాల్లో నైపుణ్యం ఉంటే డీఐ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించొచ్చు.
అర్థమెటిక్ అంశాల్లో పార్టనర్‌షిప్స్, పర్సంటేజెస్, దాని అనువర్తనాలు, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్ చాప్టర్లు ముఖ్యమైనవి.
రీజనింగ్
లాజికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విభాగం రీజనింగ్. ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు లాజిక్‌గా ఉంటాయి. ఏ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకొని, దానికి అనుగుణంగా సిద్ధమవాలి.
కోడెడ్ ఇన్ ఈక్వాలిటీస్/ఇన్‌పుట్ ఔట్‌పుట్; సిలాయిజమ్స్/కోడింగ్ అండ్ డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అండ్ పజిల్స్ (సర్కులర్, లీనియర్ అరేంజ్‌మెంట్స్..) సెక్షన్ల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి.
బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్స్ అండ్ డిస్టెన్స్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్, క్రిటికల్ రీజనింగ్ సెక్షన్లకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది.
సర్కులర్ సీటింగ్ అరేంజ్‌మెంట్, లీనియర్ సీటింగ్ అరేంజ్‌మెంట్, డబుల్ లైనప్ అండ్ పజిల్స్ విభాగాలు రీజనింగ్‌లో అధిక కాఠిన్యత గల ప్రశ్నలుగా చెప్పవచ్చు. ఈ విభాగాల్లో స్కోరు చేయడానికి సాధన చాలా అవసరం.
ఇంగ్లిష్
గ్రామీణ నేపథ్యమున్న అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు ఈ సెక్షన్ గురించి ఆందోళన చెందుతుంటారు. ఇంగ్లిష్ స్కోరు తుది ఎంపికలో కీలకంగా మారుతుంది. వొకాబ్యులరీ, గ్రామర్‌పై పట్టు ఉంటే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
మెయిన్ పరీక్షలో రీడింగ్ కాంప్రెహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్/సెంటెన్స్ జంబుల్/ఆడ్ మన్ ఔట్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
గ్రామర్‌పై పట్టు సాధించిన తర్వాత వీలైనన్ని బిట్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవడం ముఖ్యం.
జనరల్ అవేర్‌నెస్
ప్రధానంగా బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో తాజా పరిణామాలు, విధానాలపై దృష్టిసారించాలి. ఈ విభాగంలోని మొత్తం 40 ప్రశ్నల్లో స్టాండర్డ్ జీకే (5), బ్యాంకింగ్ అవేర్‌నెస్ (10), కరెంట్ అఫైర్స్ (25) ప్రశ్నలు వస్తున్నాయి. వివిధ దేశాల కరెన్సీలు, రాజధానులు, నేషనల్ పార్కులు, ముఖ్య తేదీలు, పోర్టులు, అణువిద్యుత్ కేంద్రాలు, దేశీయ నృత్యాలు, క్రీడలు-విజేతలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
బ్యాంకింగ్ అవేర్‌నెస్‌కు సంబంధించి మానిటరీ పాలసీ, ఎన్‌పీఏలు, ఎంసీఎల్‌ఆర్, డిజిటల్ పేమెంట్స్, బ్యాంకులు – వాటి యాప్స్, జీఎస్‌టీ తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
కరెంట్ అఫైర్స్‌లో ప్రభుత్వ విధానాలు, ఆర్‌బీఐ అండ్ బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బుక్స్ – ఆథర్స్, ఇండెక్స్, కమిటీలు, వార్తల్లో వ్యక్తులు, స్పోర్‌ట్స తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
స్కోరింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యమున్న విభాగమిది. కంప్యూటర్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్‌వర్క్ లేయర్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత పదజాలంపై దృష్టిసారించాలి. ఎంఎస్ ఆఫీస్ టూల్స్‌పైనా అవగాహన అవసరం.
స్కేల్ -1 పోస్టులకు రూ. 36 వేలకు పైనే..
స్కేల్-1 ఆఫీసర్ హోదాలో కేరీర్ ప్రారంభించే వారు ప్రొబేషనరీ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి కేరీర్ ప్రారంభంలో బేసిక్, హెచ్‌ఆర్‌ఏ, డీఏ, ప్రత్యేక అలవెన్సులు కలుపుకొని నెలకు రూ.36,500కు పైగా వేతనం అందుతుంది. స్కేల్-2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్‌కు రూ.46 వేలకు పైగా వేతనం ఉంటుంది. మల్టీపర్పస్ స్టాఫ్‌కు రూ. 23 వేల వరకు ఉంటుంది.
ఎంపిక విధానం
ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు ఉంటాయి.
ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టులను మెయిన్స్ లో సాధించే స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తారు.
ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు మెయిన్స్, కామన్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
స్కేల్-2, 3 ఆఫీసర్ పోస్టులను సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష, కామన్ ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు.
సెక్షన్ కటాఫ్, రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది.
ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, స్పెషలిస్టు కేడర్), ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల్లో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లిష్ పేపర్లతో పాటు ప్రొఫెషనల్ నాలెడ్‌జ, కంప్యూటర్ నాలెడ్‌జ వంటి విభాగాలపై ప్రశ్నలు అడుగుతారు.
ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1 (ప్రిలిమినరీ)..
సమయం 45 నిమిషాలు..
రీజనింగ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు వుంటాయి
న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు వుంటాయి
మొత్తం 80 ప్రశ్నలకు 80 మార్కులు
మెయిన్ పరీక్ష విధానం..
సమయం 2 గం.
రీజనింగ్ లో 40 ప్రశ్నలకు 50 మార్కులు
న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఎబిలిటీ లో 40 ప్రశ్నలకు 50 మార్కులు
జనరల్ అవేర్‌నెస్ లో 40 ప్రశ్నలకు 40 మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్/హిందీ లాంగ్వేజ్ లో 40 ప్రశ్నలకు 40 మార్కులు
కంప్యూటర్ నాలెడ్జ్ లో 40 ప్రశ్నలకు 20 మార్కులు
మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు
ముఖ్యతేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2018, జూలై 2.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు..
ఆఫీసర్ స్కేల్-1: ఆగస్టు 11, 12, 18.
ఆఫీస్ అసిస్టెంట్లు: ఆగస్టు 19, 25, సెప్టెంబర్ 1.
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీలు: ఆఫీసర్స్ పోస్టులకు సెప్టెంబర్ 30, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అక్టోబర్ 7.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100.
వెబ్‌సైట్: www.ibps.in