రూ10నాణాలను తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. అదేమని ప్రశ్నిస్తే మీకు ఇష్టమైన చోట ఫిర్యాదు చేసుకోమని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. దీంతో సదరు ఖాతాదారుడు రీజనల్ మేనేజరుకు ఫిర్యాదు చేశారు. బండారుగూడేనికి చెందిన కుంజా ప్రసాదు రూ. వెయ్యి విలువగల పది రూపాయల నాణేల(100)ను తన ఖాతాలో జమ చేసేందుకు శుక్రవారం నరసాపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖకు వెళ్లారు. ఆయన తీసుకెళ్లిన నాణేలను డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. దీంతో సమస్యను పరిష్కరించాలంటూ ఖాతాదారుడు భద్రాచలం రీజనల్ మేనేజరును ఫోన్‌లో సంప్రదించాడు. మేనేజరుకు ఫోన్ ఇమ్మని రీజనల్ మేనేజరు కోరగా.. సదరు బ్యాంకు మేనేజరు రీజనల్ మేనేజరుతో మాట్లాడడానికి సైతం ఇష్టపడకపోవడంతో ఫిర్యాదు చేయాలని ఖాతాదారుడికి సూచించారు. దీంతో ఖాతాదారుడు భద్రాచలం రీజనల్ మేనేజరు మనోహర్‌రెడ్డిని కలసి ఫిర్యాదు ఇచ్చారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయమై నరసాపురం ఏపీజీవీబీ మేనేజరును వివరణ కోరేందుకు ప్రయత్నించగా…..ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా ఇలా పలు సందర్భాల్లో రూ. పది నాణేలు చెల్లవని కొన్ని బ్యాంకులు తిరస్కరిస్తున్న కారణంగా బహిరంగ మార్కెట్‌లో అవి చెల్లవన్న ప్రచారం సామాన్య జనంలో కొనసాగుతోంది.