యూట్యూబ్‌లో ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే.. దానికి వ్యూస్ వచ్చాయనుకోండి.. దానికి తగినట్టు పేమెంట్స్ చేస్తుంటుంది యూట్యూబ్ యాజమాన్యం. అయితే, సరిగ్గా చెల్లింపులు చేయట్లేదంటూ సంస్థపై కొద్ది రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై, ఎవరైనా పోస్ట్ చేసిన వీడియోలకు చెల్లింపులు రావాలంటే.. ‘పెయిడ్ చానెల్ సభ్యత్వం’ తీసుకోవాల్సిందే. వాస్తవానికి యూట్యూబ్ ఆదాయవనరు ప్రకటనలేనని, దానిపైనే తమ దృష్టి అని యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్స్ ఆఫీసర్ నీల్ మోహన్ తెలిపారు. లక్ష మందికిపైబడి సబ్‌స్క్రైబర్లున్న చానెళ్లలో వీడియోలను వీక్షించేందకు ఈ ‘పెయిడ్ చానెల్ సభ్యత్వం’ను తీసుకొస్తున్నట్టు చెప్పారు.
అందులో భాగంగా వినియోగదారులు ఆయా చానెళ్లను చూడాలంటే నెలకు 4.99 డాలర్లు (సుమారు రూ.340) చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. తద్వారా క్రియేటివ్‌గా ఆలోచించే వాళ్లకు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. అంతేగాకుండా దాని ద్వారా షర్టులు, ఫోన్ కేసెస్ వంటి వాటిని అమ్మేందుకు డైరెక్ట్‌గా యూట్యూబ్ ద్వారా ప్రకటనలను పోస్ట్ చేసుకోవచ్చని చెప్పారు. కాగా, కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో కొద్ది మొత్తాన్ని ఇస్తుంటుంది యూట్యూబ్. ఆ క్రమంలోనే పోటీ పెరిగిపోవడంతో వారికిచ్చే మొత్తాన్ని తగ్గించింది. ఇప్పుడు దానిపైనే విమర్శలు రావడంతో ఈ తాజా నిర్ణయం తీసుకుంది.