ఆదిపురుష్ : ప్రభాస్ కు తల్లి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్…!

253
Adipurush: Hema Malini To Play Prabhas’s Mother Kaushalya ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం “ఆదిపురుష్”. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, రాజేష్ నాయర్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఫలణి కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ప్రభాస్ రామాయణం నేపథ్యంతో రూపొందుతోన్న”ఆదిపురుష్”లో రాముడిగా నటిస్తున్నారు. ఇప్పటికే మెయిన్ విలన్‌ లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్‌ను ఖరారు చేశారు.

అయితే రామాయణంలోని మిగతా పాత్రధారుల విషయమై సస్పెన్స్ నెలకొంది.

ఈ నేపథ్యంలో “ఆదిపురుష్”లో రాముడి తల్లి కౌసల్య పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని కౌశల్య పాత్ర కోసం దర్శక నిర్మాతలు హేమమాలిని సంప్రదించారట. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే హేమమాలిని ప్రభాస్ తల్లిగా కనిపించబోతున్నారన్నమాట.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ అంటే సీత ఎవరు అనే విషయాన్ని దర్శక నిర్మాతలు ప్రకటించాల్సి ఉంది.

కాగా “ఆదిపురుష్” సినిమాకు సంబంధించి ఇటీవల వీఎఫ్ఎక్స్ సీన్స్ చిత్రీకరణను ముంబైలో ప్రారంభించారు.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ సీన్స్‌ను చిత్రీకరిస్తుండగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో తాత్కాలికంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది.

ఇక పాన్ ఇండియా స్టార్ వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ “ఆదిపురుష్” కాకుండా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.