తీవ్ర డిప్రెష‌న్‌కు గుర‌య్యా

238

తీవ్ర డిప్రెష‌న్‌కు గుర‌య్యా

ఏ రంగంలో వారికైనా మానసిక ఒత్తిడి మామూలే. క్రికెట్‌లో అది కాస్త ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో జ‌ట్టులో స్థానం ఉంటుంటో లేదో.. ఫైన‌ల్ లెవెన్‌లోకి తీసుకుంటారో లేదో అని టెన్ష‌న్ ఎల్ల‌ప్పుడూ ఉంటుంది.

భార‌త జ‌ట్టు 2014లో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన‌ప్పుడు తాను తీవ్ర డిప్రెష‌న్‌కు లోనైన‌ట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ప్ర‌పంచంలో తాను ఒంట‌రి వాడిన‌నే భావ‌న క‌లిగింద‌న్నాడు.

ఆ సిరీస్‌లో కోహ్లీ వ‌రుస‌గా విఫ‌ల‌మ‌య్యాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 13.50 స‌గ‌టుతో 135 ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు. తర్వాత ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కోహ్లీ గాడిలో ప‌డ్డాడు. మొత్తం 692 ప‌రుగులు చేశాడు.

అయితే తాజాగా ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్ మార్క్‌ నికోలస్‌ నిర్వహించిన ‘నాట్‌ జస్ట్‌ క్రికెట్‌’ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ త‌న చేదు అనుభ‌వాల‌ను పంచుకున్నాడు. ‘ఒకానొక స‌మ‌యంలో నేను కూడా డిప్రెషన్‌కు గురయ్యాను.

పరుగులు చేయలేకపోతున్నామనే బాధను అనుభ‌వించాను. చాలా మంది బ్యాట్స్​మెన్​ ఇది అనుభవించి ఉంటారు. ఇలాంటి సమయంలో ఏదీ మన అదుపులో ఉండదు.

దీని నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియదు. ఇంగ్లండ్​ టూర్​లో నేనది అనుభవించా. ప్రపంచంలో నేను ఒంటివాడిన‌నిపించింది. మాట్లాడేందుకు మనుషులు ఉన్నారు. కానీ బాధ‌ను అర్థం చేసుకునే వాళ్లు లేరనిపించింది.’ అని కోహ్లీ చెప్పాడు.

నిర్లక్ష్యం ప‌నికిరాదు

మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని కోహ్లీ చెప్పాడు. ‘డిప్రెషన్‌కు గురైనప్పుడు మన ఆలోచనలు పంచుకోవడానికి ఒకరు ఉండాలి. నిద్రపోవడమూ కష్టంగా ఉంది.

పొద్దున్నే లేవాలనిపించ లేదు. నాపై నాకు నమ్మకం క‌ల‌గ‌టం లేదు. వీటిని పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి? అని ఆలోచించాను. ఇతరులతో షేర్ చేసుకోవాలి అనిపించింది.

కొందరు ఇలాంటి అనుభవాలతోనే సుదీర్ఘ కాలం గడుపుతారు. ఒక్కోసారి క్రికెట్‌ సీజన్‌ అంతా ఇలాగే బాధపడతారు. దాన్నుంచి తప్పించుకోలేరు.

ఇలాంటప్పుడు మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి’ అని కోహ్లీ వివ‌రించాడు.

అప్పుడే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చా

1990ల్లో భారత జట్టును చూసి క్రికెట్లోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నానని కోహ్లీ చెప్పాడు. ‘క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు 90 ద‌శ‌కంలోని భారత ప్రేరేపించింది.

నమ్మకం, నిర్ణయం ఉంటే అద్భుతాలు జరుగుతాయని విశ్వసిస్తాను. దేశం తరఫున ఆడాలన్న కసి పెరిగింది. 18 ఏళ్ల వయసులో మా నాన్న మరణించారు.

ఆ సంఘటన నాపై విపరీతమైన‌ ప్రభావం చూపించింది. నా అంతరంగంలోకి నేను తొంగి చూసు్కున్నాను. చిన్న‌త‌నంలో నేను క్రికెట్‌ ఆడేటప్పుడు మా నాన్న చాలా కష్టపడ్డారు.

ఏదేమైనా నా కల నెరవేరుతుందని, దేశం తరఫున అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడటం నిజమవుతుందని అప్పుడే గట్టిగా అనుకున్నాను’ అని విరాట్‌ చెప్పుకొచ్చాడు.

నాకు న‌చ్చిన‌ట్టు ఉంటాను

మైదానంలో ఉన్నట్టే నిజ జీవితంలోనూ ఉంటానని కోహ్లీ అన్నాడు. ‘ఇతుల‌ను చూసి నేను జీవించ‌ను. సొంత ఆలోచ‌న‌ల‌తో పనిచేసుకుంటూ వెళ్తాను.

వ్యక్తిగతంగా నేనేం చేస్తానన్నదే నాకు ముఖ్యం. అలాగే మైదానంలోనూ కృషి చేస్తాను. జ‌నాలు న‌న్ను మెచ్చుకోవాల‌ని నేను ఎన్న‌డూ ఆశించ‌ను. నేనలాంటి వ్యక్తిని కాను.

అంచనాల విషయానికి వస్తే… వాటి గురించి ఆలోచిస్తేనే త‌లంతా భారంగా అనిపిస్తుంది’ అని విరాట్‌ తెలిపాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్ట్ సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి అహ్మదాబాద్‌లో మూడో టెస్ట్ (డే అండ్ నైట్‌) ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.