స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “కారవాన్”కు యాక్సిడెంట్ జరిగింది. కొద్దిసేపటిక్రితం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారవాన్ ను వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొంది.
ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయిన కారవాన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడని, దీంతో కారవాన్ వెనుకే వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు చోటు చేసుకోలేదు. కానీ కారవాన్ వెనుక భాగం మాత్రం ధ్వంసం అయ్యింది.
ప్రస్తుతం స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ప్రమాద సమయంలో వాహనంలో అల్లు అర్జున్ లేరని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం.
కాగా అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
“పుష్ప” చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్ లో రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో “పుష్ప” సినిమాలోని రెండు కీలకమైన భారీ సన్నివేశాలను తెరకెక్కించారు. తాజాగా అక్కడ షూటింగ్ ముగియడంతో అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్నారు.
“పుష్ప” చిత్రం ఎర్ర గంధపు అక్రమ రవాణాతో ముడిపడి ఉన్న వారి జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో ఆర్య విలన్ గా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన బన్నీ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 2021 ఆగస్టు 13న “పుష్ప” చిత్రం థియేటర్లలోకి రానుంది.