అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రాన్ని రీ షూట్ చేయ‌నున్న చిత్ర బృందం

275
remake film

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో సందీప్ వంగా తెర‌కెక్కించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ మూవీ త‌మిళంతో పాటు హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ టైటిల్ తో చిత్రం రూపొందుతుంది. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాసారు. అయితే చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్స్‌, ట్రైల‌ర్‌ల‌లో సృజ‌నాత్మ‌క‌త దెబ్బ‌తింద‌ని ఇది ఒరిజిన‌ల్ వ‌ర్షెన్‌ని చెడ‌గొడుతుందేమోన‌ని భావించిన నిర్మాత‌లు చిత్రం మొత్తాన్ని రీ షూట్ చేయాల‌ని భావించారు. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించింది చిత్ర నిర్మాణ సంస్థ ‘ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్’.

ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన వ‌ర్మ చిత్రీక‌ర‌ణ‌ని మ‌ధ్య‌లోనే ఆపేస్తున్నాం. సినిమాతో మేము పూర్తిగా తృప్తి చెంద‌లేదు. అందువ‌ల‌న చిత్రాన్ని రిలీజ్ చేయ‌డం లేదు. విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా మ‌ళ్ళీ ఈ చిత్ర షూటింగ్ మొద‌టి నుండి జ‌ర‌పనున్నాం. ద‌ర్శ‌కుడితో పాటు మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాల‌ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నాం. చిత్రాన్ని మొద‌టి నుండి షూట్ చేయ‌డం వ‌ల‌న మాకు న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసిన కూడా తెలుగులో అంత హిట్ అయిన సినిమాలోని ఏ భావాన్ని మేము చెడ‌గొట్టొద్ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నామ‌ని తెలిపారు చిత్ర బృందం. కొత్త టీంతో రేయింబవళ్లు కష్టపడి ఈ సినిమా 2019, జూన్‌లో విడుదల చేస్తాము. మాకు మీ స‌పోర్ట్ త‌ప్ప‌క ఉంటుంద‌ని భావిస్తున్నాము అని నిర్మాణ సంస్థ లేఖ‌లో తెలిపింది.