ప్రేమిస్తోందని వేధించిన తల్లితండ్రులు

319

టీనేజ్‌లో పిల్ల‌లు త‌ప్పులు చేస్తుంటారు. ఎందుకంటే ఆ వ‌య‌సు అలాంటిది. పెద్ద‌లు వాటిని స‌రిచేస్తూ పిల్ల‌ల‌ను న‌డిపించాలి.

కానీ ప్రేమిస్తోంద‌ని క‌న్న కూతురును త‌ల్లిదండ్రులు వేధించారు. ఆ బాధ‌ను త‌ట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

కాలేజీలో చదువుతున్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న పెద్దలు ఆమె బయటకు వెళ్ళకుండా జుట్టు కత్తిరించారు.

ఇంటికే పరిమితమైన ఆ అమ్మాయి ఇది తట్టుకోలేక‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే బలవన్మరణానికి పాల్పడింది.

స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సాకు చెందిన పరమేశ్వర్ 20 ఏళ్ల కిందట హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్ పల్లి సమీపంలోని లక్ష్మీగూడకు వచ్చి జీవనం సాగిస్తున్నాడు.

అతనికి నలుగురు పిల్లలు. వారిలో చిన్న కూతురు లీజా (20) అదే ప్రాంతానికి చెందిన అక్రం, అలియాస్ అఫ్సర్ (20) అనే యువకుడితో ప్రేమలో పడింది.

ఇద్దరూ ఇంటర్‌లో ఒకే కళాశాలలో చదువుకున్నారు. కాలేజీకి వచ్చిపోయే క్రమంలో వీరి ప‌రిచ‌యం కాస్తా ప్రేమగా మారింది.

ఈ విషయాన్ని గమనించిన పరమేశ్వర్ కుటుంబ సభ్యులు కూతుర్ని హెచ్చరించారు. మరోవైపు తమ కుమార్తెతో ప్రేమ వ్యవహారం మానుకోమని అఫ్సర్‌కు కూడా పలుమార్లు చెప్పారు.

అయినా వీరి ప్రేమ కొనసాగుతూనే ఉంది. దీంతో లీజా కుటుంబ సభ్యులు ఆమె బ‌య‌టికి వెళ్ల‌కుండా ఉండేందుకు జుట్టు కత్తిరించారు.

దీంతో ఆ యువతి మానసికంగా కుంగి పోయింది. దీనికి తోడు అఫ్సర్ తరచూ ఆమెకు ఫోన్ చేసి వేధించసాగాడు.

ఒకవైపు కుటుంబ సభ్యుల నిర్భంధం మరోక వైపు ప్రియుడి ఫోన్లు. ఈ రెండిటి మధ్య మాన‌సికంగా న‌లిగిపోయిన లీజా మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

ఆత్మహత్య చేసుకునే ముందు ప్రియుడితో సుమారు గంటపాటు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఆమె మరణించాక కూడా అఫ్సర్ 135సార్లు ఫోన్ చేశాడు.

ఈ క్రమంలో ప్రియుడితో మాట్లాడుతూనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్నేహితులు బంధువులు భావిస్తున్నారు.

కేసు నమోదు చేసుకున్న మైలార్‌దేవ్ పల్లి పోలీసులు అఫ్సర్‌ను రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.