తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగైంది. ఇచ్చిన అప్పు అడిగినందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు.
దుండగులు ఆయనను తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా హతమార్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని వైష్ణోదేవి కాలనీకి చెందిన నరహరి (40) ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
ఆయన భార్య అరుణకుమారి హన్వాడ మండలంలోని వేపూర్ జీహెచ్ఎంగా పనిచేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందిన జగదీశ్ అలియాస్ జగన్ పదేళ్ల క్రితం రాజేంద్రనగర్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
రెండేళ్ల క్రితం నరహరికి ఆయనతో పరిచయం ఏర్పడింది.వీరి పరిచయం ఆర్థిక సంబంధాలకు దారితీసింది.
ఈ క్రమంలో జగదీశ్‌కు దాదాపు కోటి రూపాయల వరకు నరహరి రుణంగా ఇచ్చాడు.
డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తానన్న సమయం మించిపోవడంతో జగదీశ్‌పై నరహరి ఒత్తిడి పెంచాడు.
డబ్బుల గురించి అడిగేందుకు బుధవారం సాయంత్రం జగదీశ్ ఇంటికి నరహరి వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల వరకు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి.
దీంతో బాలానగర్‌లో తనకు ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని జగదీశ్ హామీ ఇవ్వడంతో శాంతించిన నరహరి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.
ఈ క్రమంలో స్థానిక భగీరథ కాలనీ సమీపంలో ఆయన బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. కిందపడిన నరహరి మెడను కత్తితో కోసి దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనపై మృతుడి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నరహరిని కారులో వెంబడించి ఢీకొట్టి హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.