కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి, ఒకరు గల్లంతు!

469
car crashed into a canal .. Two killed one lost!

శివరాత్రి వేడుకల్లో పాల్గొని తిరిగి కారులో ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి కారు కాల్వలోకి దూసుకెళ్లింది.

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని గొల్లలకోడేరుకు చెందిన

ముందిటి సరేశ్ వర్మ (36), చింతలపాటి శ్రీనివాస్‌రాజు (46),ఇందుకూరి వెంకట సత్యనారాయణరాజు, ముదునూరి వెంకటగణపతి రాజు, మున్నింటి సీతారామరాజు ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారు.

నిన్న శివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వసంతవాడలో బంధువుల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ తెల్లవారుజామున తిరిగి కారులో తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో లొల్ల లాకుల మలుపు వద్ద కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.

ప్రమాదం నుంచి వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడ్డారు.

మిగిలిన ముగ్గురు గల్లంతు కాగా, వారిలో సురేశ్ వర్మ, శ్రీనివాస్‌రాజు మృతి చెందారు.

వారి మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వెంకట సత్యనారాయణరాజు కోసం ఈతగాల్లు గాలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.