మంటల్లో దూకి రైతు ఆత్మహత్య

430
Farmer suicide jumping flames

అధిక పెట్టుబడిపెట్టి ఆరుగాలం శ్రమించినప్పటికీ రైతన్నకు చేసిన అప్పులు తీరలేదు.

దీంతో మనస్తాపం చెంది మంటల్లోకి దూకి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో చోటుచేసుకొంది.

బట్వారం గ్రామానికి చెందిన కోటపు శ్రీనివాస్‌(40) అనే రైతు తనకున్న నాలుగు ఎకరాల పొలంలో పత్తి, కంది పంటలను సాగుచేశాడు.

ఆయనకు యూనియన్‌ (ఆంధ్రా)బ్యాంకులో రూ.1.50 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద దాదాపు రూ.4 లక్షల అప్పులు ఉన్నాయి. కనీసం పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో కుంగిపోయాడు.

చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నాడు. మంగళవారం ఉదయం పొలంవద్ద పత్తికట్టెలు కాలుస్తున్న సమయంలో మంటల్లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

గమనించిన కుటుంబ సభ్యులు తాండూరుజిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి శ్రీనివాస్‌ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.