దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, 45 ఏండ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు టీకాలు వేస్తున్నారు.
అయితే, ఈ టీకాలు తీసుకున్న తర్వాత కొంతమంది మృత్యువాత పడుతున్నారు.
తాజాగా పశ్చిమబెంగాల్‌లో హృదయసంబంధ రోగాలతో బాధపడుతున్న ఇద్దరు వృద్ధులు కొవిడ్ టీకా తీసుకున్న కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
డార్జిలింగ్‌కు చెందిన పారుల్ దత్తా (75) అనే మహిళ ఈ నెల 8న మధ్యాహ్నం కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నది. అనంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికివెళ్లింది.
అయితే, సాయంత్రం ఆరు గంటలకల్లా వాంతులు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు.
మరో ఘటనలో జల్పాయ్‌గురి జిల్లా ధూప్‌గురికి చెందిన క్రిష్ట దత్తా (65) అనే వృద్ధుడు కూడా ఈ నెల 8న ఉదయం గంటలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి అవలక్షణాలు లేకుండా సజావుగానే ఇంటికి చేరుకున్న వృద్ధుడికి సాయంత్రం వాంతులు అయ్యాయి. ఆ తర్వాత బాగానే ఉండటంతో ఎప్పటిలాగే ఆ రాత్రికి నిద్రపోయాడు.
కానీ తెల్లవారుజామున 5 గంటలకు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి విలవిల్లాడుతూ అరగంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు.
ఈ రెండు కేసుల్లోనూ బాధితులు గత కొంతకాలంగా హృదయసంబంధ రోగాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.