పోలీస్ శాఖలో భారీగా కానిస్టేబుళ్లు, సబ్ ఇన్ స్పెక్టర్(SI) పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. 18 వేల పోస్టుల భర్తీకి 15 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. జైళ్లు, అగ్నిమాపకశాఖ, SPF (స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్), ఆర్టీసీ విభాగాల్లో మరో 4 వేల పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తంగా 22 వేల పోస్టుల భర్తీకి పోలీస్ నియామక బోర్డు దశలవారీగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నప్పటికీ.. రిజర్వేషన్ తోపాటు గత నోటిఫికేషన్‌లోని కొన్ని అంశాల్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉండటంతో సంబంధిత అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కానిస్టేబుల్ నుంచి పైస్థాయి వరకు పెద్ద సంఖ్యలో పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. ఫలితంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఎక్కువ సంఖ్యలో SI పోస్టులను కేటాయించనున్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
2012 తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీలో కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టలేదు. దీంతో ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉంది. మరో కీలక విభాగమైన జైళ్ల శాఖలో కూడా గత నోటిషికేషన్‌లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దీంతో ఈ సారి పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది సర్కార్.