దూసుకొస్తు‌న్న లైఫై

293
what is LiFi - Light Speed Internet Connectivity

స్మార్ట్‌ఫోన్ల ఆధునీకరణ పెరుగుతున్న కొద్దీ సాంకేతికత కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్‌లో నెట్‌ వినియోగం కోసం వైఫై, డేటాను వాడటం సహజం. అయితే… ప్రస్తుతం ముందుకొచ్చిన అవసరాల రీత్యా వైఫై కంటే వేగవంతమైన కనెక్టివిటీ కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్షలను తీర్చేందుకు ముందుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ లైఫై. ఇది వైఫై కంటే వందరెట్లు వేగంగా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే…



 

నెట్‌ వినియోగంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయనడంలో అతిశయోక్తిలేదు.
వైఫై, మొబైల్‌ డేటా వాడుతున్నా బ్రౌసింగ్‌, డౌన్‌లోడ్‌ చాలా నెమ్మదిగా ఉందని చిరాకు పడుతున్నారా? చిన్న వీడియో చూడాలన్నా ఎక్కువ సమయం ప్రాసెసింగ్‌తో విసుగు పుడుతోందా..? ఇలాంటి వాటన్నింటికీ ప్రత్యామ్నాయం లభించింది. సెకనుకు 1.5 గిగాబైట్ల వేగంతో పనిచేసే ఆయుధం దూసుకొస్తోంది. అదే ‘లైఫై’ (లైట్‌ ఫెడిలిటీ). ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు ఫిలిప్స్‌ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తాజాగా ఆవిష్కరించింది. ఇకపై మనం వైఫై కాదు, లైఫై (LiFi) పై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వైఫై ఇక చరిత్రపుటల్లోకి జారుకోనుంది. దీని ద్వారా సురక్షితమైన, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను పొందేందుకు వీలుంటుంది. వైఫె- వైర్‌లెస్‌ తరంగాల ఆధారంగా పనిచేసే టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. అయితే లైఫై మాత్రం కాంతి తరంగాల ఆధారంగా పనిచేస్తుంది.

అంటే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎల్‌ఈడీ లైట్లలో మోడెమ్‌ను అమరుస్తారు. ఈ క్రమంలో లైట్లను ఆన్‌ చేసినప్పుడు ఆ మోడెమ్‌ నుంచి కాంతి తరంగాలు లైట్ల ద్వారా బయటకు వస్తాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌కు అమర్చబడిన ప్రత్యేకమైన యూఎస్‌బీ డాంగిల్‌ ఆ కాంతి తరంగాలను గుర్తించి వాటిని ఇంటర్నెట్‌ తరంగాలుగా మార్చి డివైస్‌లకు ఇంటర్నెట్‌ను అందిస్తుంది. వైర్‌లెస్‌ తరంగాలు వాడేందుకు వీలుకాని ప్రదేశాల్లో సైతం లైఫైని సులభంగా వాడొచ్చు. దీంతోపాటు ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారులకు పూర్తి సెక్యూరిటీని అందిస్తుంది. గోడల ద్వారా వైఫై బయటకు కూడా ప్రసారం అవుతుంది. కానీ లైఫై కేవలం ఒకే చోట ఉంటుంది. ఇది వైఫై ప్రయాణించినట్లు గోడల ద్వారా ప్రయాణించదు. దీంతో లైఫై ద్వారా వచ్చే ఇంటర్నెట్‌కు సెక్యూరిటీ ఉంటుంది. ఇతరులు దాన్ని యాక్సెస్‌ చేయలేరు. కార్పొరేట్‌ కార్యాలయాల్లో, ఇతర సంస్థల్లో లైఫై ద్వారా ఇంటర్నెట్‌ను వాడితే అది సురక్షింగా ఉండడమే కాదు, సుస్థిరమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఫిలిప్స్‌ ఆవిష్కరించిన ఈ లైఫై టెక్నాలజీ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. వాణిజ్యపరమైన వినియోగానికి కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.


సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం ఈ లైఫై. స్కాట్‌ల్యాండ్‌ కేంద్రంగా నడుస్తోన్న ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హెరాల్డ్‌హాస్‌ 2011లో ఈ విధానాన్ని కనుగొన్నారు. అప్పటినుంచే దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విజిబుల్‌ లైట్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీతో పరిశోధకులు పలుసార్లు రకరకాల రీక్షలు చేశారు. లైఫై ద్వారా 224 జీబీపీఎస్‌ సామర్థ్యంతో డేటాను పంపిణీ చేసే అవకాశం ఉంది. ఇది మన కంటితో చూడలేనంత వేగంగా పనిచేస్తుంది. కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత ఎల్‌ఈడీ కాంతికిరణాల ద్వారా సెల్యులర్‌ టవర్‌ కన్నా ఎక్కువగా ఈ లైఫై నుంచి డేటా వస్తుందని హౌరాల్ద్‌ హాస్‌ నిరూపించాడు. టెక్నాలజీతో పాటు, ఫైలెట్‌ ప్రాజెక్ట్‌లపై దీన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్‌ లైట్‌ సొల్యుషన్‌ను విజిబుల్‌ లైట్‌ కమ్యునికేషన్‌ ద్వారా డిజైన్‌ చేసినట్లు చెబుతున్నారు. ఈ కొత్త వైర్‌లెస్‌ వ్యవస్థలో 400 నుంచి 800 టెరాహెడ్జ్‌ స్పీడ్‌తో (సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో) కాంతి.. బైనరీ కోడ్‌లో డేటాను బదిలీ చేస్తుంది. వైర్‌లెస్‌ ద్వారా జరిగే ఈ ప్రాసెస్‌ కొరకు హాస్‌ ఒక యాప్‌ను కూడా రూపొందించి, తమ హాస్పిటల్స్‌లో కూడా ఇన్‌స్టాల్‌ చేశారట. భవిష్యత్‌లో కాంతి ద్వారా నడిచే ఈ లైఫై వినియోగం ఎక్కువగా ఉంటుందని హాస్‌ ఘంటాపథంగా చెబుతున్నాడు.

అయితే లైఫైలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఇది గోడలు దాటి వెళ్లలేదు. ఒకే పెద్ద రూంలో ఊహకు అందని వేగంతో ఇది డేటాను డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేస్తుందే తప్ప మరో గదిలోకి వెళ్లలేదు. పెద్ద వాణిజ్య సంస్థల్లో చాలా ఫాస్ట్‌గా డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు ఈ లైఫై బాగా ఉపయోగపడుతుందని దీనికి భవిష్యత్తులో మంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ‘ఒలెడ్‌ కాం’ అనే ఓ ఫ్రెంచ్‌ సంస్థ లైఫై వాడకంతో పాటు.. ఈ వ్యవస్థను స్థానిక ఆస్పత్రుల్లో కూడా ఇన్‌స్టాల్‌ చేసింది. లైఫై ఇప్పటికిప్పుడు వైఫై స్థానాన్ని భర్తీ చేయకపోయినా.. రానున్న రోజుల్లో వైఫైని మరిపించే విధంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


లైఫైలో ముఖ్యాంశాలు :
– 224 గిగాబైట్స్‌ వేగంతో పలు పరీక్షల అనంతరం ప్రపంచానికి పరిచయం కాబోతోంది. కార్యాలయాలు, పారిశ్రామిక వాతావరణంలో శాస్త్రవేత్తలు లైఫై పై పరీక్షలు నిర్వహిస్తున్నారు.
– ఎల్‌ఈడీ లైట్ల కాంతి తరంగాలతో కూడిన ఈ కొత్త వ్యవస్థ.. కమ్యూనికేషన్‌కు ఎంతో ఉపయోగంగా ఉండటంతో పాటు.. సురక్షితంగా కూడ ఉంటుందని భావిస్తున్నారు.
– ‘విజిబుల్‌ లైట్‌ కమ్యూనికేషన్‌’తో పనిచేసే కొత్త లైఫై… వైఫై కన్నా వంద రెట్లు వేగంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
– కాంతిని ఉపయోగించి సమాచారాన్ని డేటాగా ప్రసారం చేసే ఈ టెక్నాలజీని ట్వాలిన్‌, ఎస్టోనియాలోని కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో పరీక్షించారు.
– ఈ కొత్త వైర్‌లెస్‌ వ్యవస్థలో 400నుంచి 800 టెరాహెడ్జ్‌ స్పీడ్‌తో (సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో) కాంతి.. బైనరీ కోడ్‌లో డేటాను బదిలీ చేస్తుంది. ఈ విజిబుల్‌ లైట్‌ గోడలనుంచి ప్రసారం కాదు. పైగా సురక్షితంగా ఉండటంతోపాటు ఎటుపడితే అటు ప్రసరించేందుకు వీలుగా ఉంటుంది.
– ఒకే ఎల్‌ఈడీ నుంచి ప్రసారమయ్యే మిణుకు మిణుకుమనే కాంతి ద్వారా సెల్యులార్‌ టవర్‌ కంటే ఎక్కువగా డేటా ప్రసారం అవుతుందని హాస్‌ ప్రదర్శించి చూపారు. మోర్స్‌ కోడ్‌ మాదిరిగానే ఈ వ్యవస్థ కాంతిని ఉపయోగించి ప్రసారం చేసినా.. కంటితో గుర్తించలేనంత వేగంతో కమ్యూనికేషన్‌ నడుస్తుందని చెప్తున్నారు.
– ఈ సురక్షిత వైర్‌లెస్‌ యాక్సిస్‌ కోసం హాస్‌ టీమ్‌ ఓ ప్లే ప్లగ్‌ను, అప్లికేషన్‌ను రూపొందించారు. ‘ఒలెడ్‌ కాం’ అనే ఓ ఫ్రెంచ్‌ సంస్థ లైఫై వాడకంతోపాటు.. ఈ వ్యవస్థను స్థానిక ఆసుపత్రుల్లో కూడ ఇన్‌స్టాల్‌ చేసింది.