క్రెడిట్ కార్డును ఇలా వాడితే బోలెడు ప్రయోజనాలు

266

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు లేని వాళ్లు చాలా త‌క్కువ మందే ఉంటారు. ఎందుకంటే అనుకోని ఆర్థిక సమస్యలు ఎదురైన‌ప్పుడు ఈ క్రెడిట్ కార్డు మ‌న‌ల‌ను ఆదుకుంటుంది.

అత్యవసరంగా డబ్బు కావాలని అనుకున్నప్పుడు ఆది ఉప‌యోగ‌ప‌డుంది. చేతిలో చిల్లి గ‌వ్వ లేన‌ప్పుడు ఈ క్రెడిట్ కార్డు ఆదుకుంటుంది.

నచ్చిన వస్తువును ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే అవకాశాన్ని క్రెడిట్ కార్డు కల్పిస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి.

బాధ్యతా రాహిత్యంగా వాడితే మాత్రం ప్ర‌మాద‌క‌ర‌మే. క్రెడిట్ కార్డును ఎలా వాడితే ప్ర‌యోజ‌న‌మో ఓసారి చూద్దాం..

క్రెడిట్ స్కోర్: క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడితే క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. మన స్థోమతకు తగ్గట్టుగా మాత్రమే కొనుగోలు చేయాలి.

ప్రతి నెలా సకాలంలో బిల్లులు చెల్లించడం ముఖ్యం. క్రెడిట్ కార్డు ద్వారా అప్పుల ఊబిలో చిక్కుకోకూడ‌దంటే ఇదొక్కటే మార్గం. ఎప్పటికప్పుడు బిల్లును పూర్తిగా సకాలంలో చెల్లించాలి.

కాస్త ఆలస్యమైనా లేట్ పేమెంట్ రూపంలో భారీగా ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. పేమెంట్ హిస్టరీపై క్రెడిట్ స్కోరు ఆధారపడి ఉంటుంది.

చెల్లింపులు ఆలస్యమైతే మీ స్కోరుపై ప్రభావం పడుతుంది.

బడ్జెట్‌కు కట్టుబడి ఉండటం: మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే క్రెడిట్ కార్డును మీ బడ్జెట్ పరిమితులకు అనుగుణంగా వాడుకోవచ్చు. క్రెడిట్ కార్డు కొనుగోళ్ల ద్వారా రివార్డు పాయింట్లను సైతం పొందొచ్చు.

క్రెడిట్ కార్డు వాడకాన్ని జాగ్రత్తగా గమనించడం కోసం వారానికి లేదా రెండు వారాలకోసారి మీ క్రెడిట్ కార్డు ఖర్చులను ఆన్‌లైన్లో‌ పరీక్షించుకోవాలి.

స్వీయ నియంత్రణ: క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపేటప్పుడు చాలా మంది ఎక్కువగా ఖర్చు చేసేస్తుంటారు.

మీరు కూడా ఇలాగే ఎక్కువ ఖర్చు చేస్తుంటే మీ క్రెడిట్ లిమిట్ తగ్గించాలని క్రెడిట్ కార్డు కంపెనీని కోరవచ్చు.

అలా వద్దనుకుంటే మీరే ఓ పరిమితి విధించుకోవాలి. ఈ లిమిట్ దాటాక మళ్లీ నెల మారే వరకు క్రెడిట్ కార్డును పక్కనపెట్టండి.

రివార్డులు: క్రెడిట్ కార్డు వాడకంలో దాని ప్రయోజనాలను అందుకోవడంలో ఆరి తేరిన వారు రివార్డ్‌లను వాడుకోవడంలో ముందుంటారు.

క్యాష్ బ్యాక్, హోటల్ లాయల్టీ పాయింట్లు, ఫ్రీక్వెంట్ ఫ్లయర్ మైల్స్ తదితరాలను పొందొచ్చు. కార్డును తెలివిగా వాడితే బోలెడన్ని రివార్డు పాయింట్లను సొంతం చేసుకోవచ్చు.

ఇవి ఎక్స్‌పైర్ అయ్యే ముందే రీడిమ్ చేసుకోవాలి. చాలా మంది క్రెడిట్ కార్డు యూజర్లు రివార్డ్ పాయింట్లను తరచుగా చెక్ చేసుకోరు.

దీంతో అవి వృథా అవుతాయి. మీరు అలా చేయకండి.

అదనపు ప్రయోజనాలు: క్రెడిట్ కార్డు రివార్డుల పట్ల మీకు ఆసక్తి లేకపోయినప్పటికీ ఇతర ప్రయోజనాలు పొందొచ్చు.

కొన్ని క్రెడిట్ కార్డులతో ఉచితంగా ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రైస్ ప్రొటెక్షన్ పొందొచ్చు.

అదనంగా వారంటీలు పొందడం, ఈ-కామర్స్ సైట్లలో ప్రత్యేకంగా డిస్కౌంట్లు పొందడం‌తోపాటు.. ఇతర ప్రయోజనాలు పొందొచ్చు.

క్రెడిట్ కార్డును తీసుకునే ముందు దాని ప్రయోజనాలు, ఫీచర్లు, ఇతర ఆఫర్ల గురించి అర్థం చేసుకోవాలి.