నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అగ్ర కథానాయిక సమంత ‘వన్ బకెట్ ఛాలెంజ్’ స్వీకరించారు. నీటిని అతిగా వృథా చేయొద్దని ట్విటర్ వేదికగా కోరారు. కొత్తగా సోషల్‌మీడియాలో ‘వన్ బకెట్ ఛాలెంజ్’ ప్రారంభమైంది. భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా.. ఇప్పటి నుంచే ప్రజలకు నీటి వినియోగంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ఈ ఛాలెంజ్ ప్రకారం.. ఆదివారం (జులై 21) కేవలం ఒక్క బకెట్ నీటిని మాత్రమే వాడాలి.
ఈ నేపథ్యంలో సామ్ కూడా ఛాలెంజ్ స్వీకరించారు. ‘నాతోపాటు ఎవరు ఉంటారు (నెటిజన్లను ఉద్దేశిస్తూ). ఈ ఆదివారం ‘వన్ బకెట్ ఛాలెంజ్’ను ఎవరు స్వీకరిస్తారు (ఫొటోలు కూడా షేర్ చేయాలి). ఎక్కువ సమయం స్నానం చేయకూడదు, మీ వాహనాల్ని కడగకూడదు, ముఖం శుభ్రం చేసుకుంటున్నప్పుడు కుళాయి తిప్పి వదిలేయకూడదు. నా వన్ బకెట్ ఛాలెంజ్ ఫొటోను పోస్ట్ చేస్తా. ఎవ్వరూ మోసం చేయకూడదు. ప్రతి చుక్కా లెక్కే’ అని ఆమె పేర్కొన్నారు.
ఈ ఛాలెంజ్‌పై సినీ ప్రముఖులు వరుణ్ తేజ్, నాగ అశ్విన్, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా స్పందించారు. ‘చివరికి ఓ అర్థవంతమైన ఛాలెంజ్ మొదలైంది. దీన్ని ప్రయత్నించండి. ఈ ఛాలెంజ్‌ను అందరికీ షేర్ చేయండి’ అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.