ఇక మీ మెయిల్స్ కి ఎక్స్‌పైరీ డేట్ ?

367
now-let-you-send-emails-with-an-expiry-date

జీమెయిల్‌లో మార్పులు చేస్తోంది గూగుల్. మార్పులంటే దాని రూపాన్ని మార్చడం కాదు.. దాని ద్వారా అందుతున్న సేవలు, ఫీచర్ల స్వరూపాన్నే మార్చేస్తోంది. పంపించే మెయిళ్లను వేరే వాళ్లు కాపీ చేసుకోకుండా, డౌన్‌లోడ్ చేసుకోకుండా, వాళ్ల ఇన్‌బాక్స్‌లో పంపించిన ఆ ఈమెయిల్ ఎన్ని నాళ్లు ఉండవచ్చో ముందే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే జీమెయిల్‌కూ ఓ ఎక్స్‌పైరీ డేట్‌ను మనం ముందే నిర్ణయించేసేయొచ్చన్నమాట. పంపించిన మెయిల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఇన్‌బాక్స్‌లో ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, లేదంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలో ముందే నిర్ణయించి మెయిల్‌ను పంపొచ్చు. మెసేజ్‌ను టైప్ చేసేటప్పుడే అక్కడ కనిపించే ఓ చిన్న లాక్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే ఎన్ని రోజులు అది ఎదుటి వారి ఇన్‌బాక్స్‌లో ఉండొచ్చో మనమే నిర్ణయించొచ్చు.

ఇక, పంపిన మెయిల్‌ను ఎదుటి వ్యక్తి కాపీ చేసుకోవడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీల్లేకుండా ‘కాన్ఫిడెన్షియల్‌‌ మోడ్’ టూల్‌ను అందులో పెట్టనుంది. అయితే, స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఎలాంటి టూల్స్ లేవు. ప్రస్తుతానికైతే వాటిని అధికారికంగా ప్రకటించలేదు గానీ, గూగుల్ ఐవో 2018 సదస్సులో ఆ వివరాలను సంస్థ వెల్లడించనుంది. అప్పుడే గూగుల్ యూఐ గురించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీనిని పైలెట్ ప్రాజెక్టుగా మాత్రమే చేపడుతున్నారు. అది సక్సెస్‌ అయితే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది.