గూగుల్ CEOకు రాబోయే ఆస్తి ఎంతో తెలుసా…?

260
google-ceo-to-get-richer-by-2500-crores

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పంట పండనుంది. అతనికి ఒకేసారి ఊహించనంత పెద్దమొత్తంలో డబ్బులు అందబోతున్నాయి. నాలుగేళ్ల కిందట కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ పొందిన సమయంలో దక్కిన 3,53,939 నియంత్రిత షేర్లు ఈ బుధవారం పూర్తిగా పిచాయ్ సొంతం కానున్నాయి. ప్రస్తుతం గూగుల్ షేరు విలువ ఆధారంగా చూస్తే ఈ మొత్తం షేర్ల విలువ 38 కోట్ల డాలర్లు (సుమారు రూ.2500 కోట్లు)గా ఉంది. ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇంత మొత్తం ఒకేసారి అందుకోవడం చాలా అరుదు.

2015లో గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ నియమితులైన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాదే సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన ప్రమోషన్ పొందారు. ఆ సందర్భంగానే పిచాయ్‌కు ఈ మూడున్నర లక్షల నియంత్రిత షేర్లు దక్కాయి. ఆయన ఈ షేర్లు పొందిన తేదీ నుంచి ఇప్పటివరకు గూగుల్ షేరు విలువ 90 శాతం పెరిగింది. నియంత్రిత షేర్లు అంటే కంపెనీ విధించే షరతులన్నింటికీ అంగీకరించిన తరువాతనే ఆ షేర్లు సదరు వ్యక్తికి పూర్తిగా బదలాయింపు అవుతాయి. రెండు రోజుల్లో ఆ నియంత్రిత షేర్లు సుందర్ పిచాయ్ సొంతం కాబోతున్నాయి.