
కొంత మంది చాలా సులభంగా మోసపోతారు. అనవసరమైన దానికి ఆశపడి ఇబ్బందుల్లో పడుతుంటారు.
అందమైన అమ్మాయిలతో మసాజ్ చేయించుకోవాలని ఆశపడిన ఓ వ్యక్తి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అందమైన అమ్మాయిలు ఉన్న ఓ యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అతనికి అసలు సంగతి తెలియలేదు.
ఈ సంఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. భారత్ నుంచి దుబాయ్‌కు వెళ్లిన ఓ యువకుడు ఈ మోసానికి గురయ్యాడు.
ఈ విషయాన్ని దుబాయ్ లోని కోర్టు విచారణను ఉటంకిస్తూ అక్కడి మీడియా ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
కోర్టు వివరాల ప్రకారం.. ఓ యాప్ లో అందమైన అమ్మాయిలను చూపిస్తూ మసాజ్ కావాలంటే.. అంటూ ఓ నంబరు ఇచ్చారు. మసాజ్ కు రూ.3,950 మాత్రమేనని ఆ యాడ్ లో పేర్కొన్నారు.
ఆ యాడ్ పై భారత్ కు చెందిన ఓ యువకుడు క్లిక్ చేశాడు. మసాజ్ కోసం ఆ వ్యక్తిని ఆల్ రెఫా అనే ప్రాంతానికి రావాల్సిందిగా కోరారు.
దాంతో అతను అక్కడికి వెళ్లాడు. ఆ తర్వాత నైజీరియాకు చెందిన నలుగురు మహిళలు అతన్ని బంధించారు.
మెడపై కత్తి పెట్టి బ్యాంక్ వివరాలు చెప్పాలని బెదిరించారు. అతను ప్రాణ భయంతో వివరాలు చెప్పేశాడు. క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతాల ద్వారా మొత్తం రూ.55,30,806 దోచుకున్నారు.
ఆ తర్వాత అతని ఐఫోన్‌ను కూడా లాక్కుని వదిలేశారు. ఆ తర్వాత పోలీసులకు, బ్యాంకుకు విషయాన్ని తెలిపినట్లు ఆ బాధితుడు కోర్టుకు చెప్పాడు.
ఈ కేసులో ముగ్గురు నైజీరియా మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.