ప్రేయసిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రియుడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. తన ఆర్థిక పరిధిలో ఉన్న బహుమానాలను ఇస్తుంటాడు.
కానీ గల్ఫ్ కంట్రీలో ఓ ప్రియుడు తన ప్రేయసి కోసం ఏకంగా ఒంటెనే దొంగతనం చేసి జైలుపాలయ్యాడు.
ప్రియురాలికి గిఫ్ఠ్‌లు ఇచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేసుకున్న ప్రియులను ఎంతో మందిని చూసుంటాం. అంతేకాదు ప్రేయసికి ఏ డైమండ్ రింగో లేదా గోల్డ్ చైనో లేదా రోజా పువ్వో లేదా సెల్ ఫోనో గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా మనం చూస్తుంటాం.
కానీ ఓ ప్రియుడికి ఓ వింత ఆలోచన వచ్చింది. తన ప్రేయసిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పాలనుకుని ఏకంగా మేలు జాతికి చెందిన ఓ ఒంటెను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
అది కొన్నది కాదండి బాబూ! ఆ ఒంటెను దొంగిలించి మరీ తెచ్చి ఇచ్చాడు. తన ప్రియురాలికి ఓ వెరైటీ గిఫ్ట్‌నైతే ఇచ్చాడు కానీ తర్వాత అతను కటకటాలు లెక్క పెట్టాల్సివచ్చింది.
జైలు కెళితేనేం తన ప్రియురాలికి విచిత్రమైన బహుమానాన్ని ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా తన ప్రేమను వార్తల్లోకి ఎక్కించాడుగా అంటారా?
ఇక ఈ విచిత్రమైన ప్రేమ వివరాల్లోకి వెళితే…
తమ పొలంలో ఉన్న ఒంటెల్లో ఒకటి పోయిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ఇంతలో పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన ఫామ్ హౌస్‌లోకి ఓ ఒంటె వచ్చిందని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ ఒంటె ఫిర్యాదు చేసిన వ్యక్తిదని గుర్తించి దానిని అతడికి అప్పగించారు.
ఇంతటితో కథ సుఖాంతం కాలేదు. ఫామ్ హౌస్ యజమానిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అసలు సంగతి వెలుగు చూసింది.
తాను ఆ ఒంటెను దొంగిలించానని.. తన ప్రేయసికి బహుమానంగా ఇవ్వడానికి దొంగతనం చేశానని అంగీకరించాడు. అది విన్నపోలీసులు అవాక్కయ్యారు.
అంతేకాదు ఆ వెరైటీ ప్రియుడితో పాటు అతని ప్రేయసిని కూడా కటకటాల వెనక్కి నెట్టారు. ఒంటెను ఇచ్చి ప్రపంచంలోనే తాను ఉత్తమ ప్రియుడిననిపించుకోవాలన్న అతని ప్లాన్ బెడిసి కొట్టింది.
చెప్పొచ్చేదేంటంటే.. అమ్మాయిలూ జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది తీసుకుంటే మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సివుంటుంది మరి.
జైలు నుంచి విడుదలయ్యాక వీరి ప్రేమ కొనసాగుతుందో లేదో దేవుడికే తెలియాలి.