
శివరాత్రిని హిందూవులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ రోజు పగలంతా ఉపవాసముండి రాత్రి జాగారం చేస్తారు.
అయితే శివరాత్రి రోజు శివునికి ఏమేం నైవేద్యంగా పెట్టాలో ఓసారి తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్చి 11వ తేదీన మహా శివరాత్రి పండుగ దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు.
‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ ప్రతి శివాలయంలో శివ భక్తులంతా ముక్తకంఠంతో మార్మోగిపోయే పవిత్ర సమయమే మహా శివరాత్రి.
మాఘ మాసంలో బహుళ చతుర్దశి రోజున వచ్చే మహా శివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
శివుడి ఆజ్ణ లేనిదే చీమైనా పుట్టదు కుట్టదన్న సామెత గురించి అందరికీ తెలిసిందే.
అలా శివుడు సర్వ లోకాలకు అధిపతిగా ఉండి లింగాకరంలో ఉద్భవించిన రోజునే మహాశివరాత్రి అంటారు.
మరో కథనం ప్రకారం, ఈ పవిత్రమైన రోజున పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని కూడా చెబుతారు.
ఈ సమయంలో శివ భక్తులందరూ ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. ఇలా చేయడం పూర్వ కాలం నుండి నేటి కలియుగం వరకు ఆనవాయితీగా వస్తోంది.
ఈ పవిత్రమైన సమయంలో ఉదయం వేళలో ఏమీ తినకుండా ఉపవాసముంటూ.. రాత్రి వేళలో నిద్ర పోకుండా మేల్కొని శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
అయితే ఈ రోజున ఆ పరమేశ్వరుని పూజించేటప్పుడు కొందరు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలా చేసి శివుని కోపానికి గురవుతుంటారు.
కాబట్టి మీరు అలాంటి పొరపాట్లు చేయకండి. ఇంతకీ శివుడికి ఏదీ ఇష్టముండదో వేటిని ఆ పరమేశ్వరుడికి అర్పించకూడదో ఇప్పుడే తెలుసుకోండి.
ఆ శివునికి ఏమి ఇష్టమో వాటినే సమర్పించి స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి.
తులసి ఆకులు
తులసి ఆకులను లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీదేవి శ్రీ విష్ణుమూర్తికి భార్య. కాబట్టి వీటిని శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లో నైవేద్యంగా సమర్పించకూడదు.
ఈ తులసి ఆకులను ఈ దేవుడికే కాదు ఇతర దేవుళ్లకు అర్పించకూడదని పండితులు చెబుతుంటారు.
తెల్లని పువ్వులు
పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరునికి తెల్లని పువ్వులంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఒకవేళ మీరు మల్లెపువ్వులను సమర్పించినా పర్వాలేదు.
కానీ మహా శివరాత్రి సమయంలో కెవ్డా మరియు చంపా పువ్వులను అస్సలు సమర్పించరాదట. ఇలా చేస్తే మీరు ఆ శివుని శాపం పొందుతారట.
అలాగే పూజ సమయంలో కూడా వీటిని శివలింగానికి అర్పించకూడదని పండితులు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లు
సాధారణంగా దేవాలయంలోకి కొబ్బరికాయను తీసుకెళ్తుంటారు. అయితే శివునికి కొబ్బరి నీళ్లను మాత్రం అర్పించకండి.
ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ, శివుడికి కొబ్బరి నీళ్లంటే పెద్దగా ఇష్టముండదట. మాములుగా అయితే కొబ్బరి నీళ్లను అందరి దేవుళ్లకు అర్పిస్తుంటారు.
కానీ ఒక్క శివుడికి మాత్రం వీటిని అర్పించరు.
కుంకుమ
మహా శివరాత్రి పండుగ సమయంలో శివునికి కుంకుమ అస్సలు సమర్పించకండి.
ఈ పవిత్రమైన పర్వదినాన మాత్రమే కాదు సాధారణ రోజుల్లో కూడా శివలింగానికి, పరమేశ్వరుడికి కుంకుమను ఎట్టి పరిస్థితుల్లో అర్పించకూడదు.
శివుడికి బూడిద అంటే ఇష్టం. కావాలంటే విబూదిని సమర్పించవచ్చు. ఎందుకంటే శివుడు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతాడు.
ఏకాంతంగా ఉండే సమయంలో శివుడు నుదుటిపై బూడిదను ఉంచుకుంటాడు. ఇది పురాణాల నుండి నేటి వరకు ఆనవాయితీగా కొనసాగుతోంది.