పింపుల్స్ ఎందుకు వస్తాయంటే…

436

చాలా మంది యువ‌తీ యువ‌కులు పింపుల్స్ (మొటిమ‌లు)తో బాధ‌ప‌డుతుంటారు.

ఇవి ముఖంపై రావ‌డంతో అందవికారంగా క‌నిపిస్తున్నామ‌ని ఫీల‌వుతూ న‌లుగురిలో తిర‌గ‌డానికి సిగ్గు ప‌డుతుంటారు.

అస‌లు మొటిమ‌లు ఎందుకు వ‌స్తాయి? మన చర్మంపై సెబెషియస్ గ్రంధులు ఉంటాయి.

‘సీబం’ అనే పదార్థాన్ని ఈ గ్రంధులు రిలీజ్ చేస్తుంటాయి.

కొన్ని సందర్భాల్లో సెబెషియస్ గ్రంధులు అతిగా స్రవించడం వల్ల చర్మ రంధ్రాలు మూత బడిపోతాయి. ఫలితంగా మొటిమలు ఏర్పడతాయి.

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే.

మారుతున్న జీవన శైలితోపాటు హార్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్ దుమ్ము ధూళి పొల్యుషన్ చుండ్రు మానసిక ఒత్తిడి మోనోపాజ్‌ కొన్ని కార‌ణాలు.

స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పీసీఓడీ రిఫైన్డ్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కూడా మొటిమ‌లు రావ‌డానికి మ‌రికొన్ని కార‌ణాలు.

మొటిమలను ఆదిలో నిర్లక్ష్యం చేస్తే ఇదో పెద్ద స్కిన్ స‌మ‌స్య‌గా త‌యార‌వుతుంది.

ఈ మొటిమ‌లు యువ‌త‌లో ఎక్కువ మందికి ముఖంపై వస్తాయి.

25 ఏళ్లు దాటిన వారిలో చాలా మందికి వీపుపై వస్తుంటాయి. ముఖంపై వచ్చే మొటిమల కంటే ఇవి మరింత బాధిస్తాయి.

వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది ఆయింట్‌మెంట్స్, క్రీమ్స్ వాడుతుంటారు.

కానీ ప్రకృతి సహజమైన పదర్థాలతోనూ వీటిని తగ్గించుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

అవిసె గింజల పొడి (ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్) 2 టీ స్పూన్లు, కమలా పండు తొక్కల పొడి 1/2 టీ స్పూన్, జాజి కాయ పొడి 1/2 టీ స్పూన్ తీసుకోవాలి.

వీటిని ఓ గిన్నెలో క‌లిపి ఆ పౌడర్‌ని స్నానానికి ఉపయోగించండి. ప్రతి రోజూ ఈ పౌడర్‌ని ఉపయోగిస్తే కొన్ని వారాల్లోనే ఫ‌లితం వ‌స్తుంది.

నిమ్మకాయలో విటమిన్ ‘సి’తోపాటు యాంటీ బయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

ఓ నిమ్మకాయను కట్ చేసి వీపు మీదున్న మొటిమలపై రాస్తే క్రమంగా ఫ‌లితం ఉంటుంది. చర్మంపై జిడ్డు కూడా తొలగిపోతుంది.

రాత్రిళ్లు పడుకునే ముందు మొటిమలపై కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే అద్భుత ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనెలో టీ ట్రీ ఆయిల్ కలిపి రాసుకుంటే ఇంకా మంచిది.

శనగ పిండి, వంట పోడా, పాలు కలిపి పింపుల్స్‌కి అప్లయ్ చేయాలి. పాపు గంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చక్కని ఫలితం ఉంటుంది.

మొటిమలపై బొప్పాయి పండు గుజ్జును రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

స్నానం చేసే ముందు మొటిమలున్న ప్రాంతంలో తేనె రాసి తర్వాత నీటితో కడిగేస్తే చ‌క్క‌ని ఫలితాన్ని చూడొచ్చు.

దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి పేస్టులా తయారు చేసి అప్లయ్ చేస్తే కూడా మొటిమలు తగ్గుతాయి. మచ్చలు కూడా పోతాయి.

గ్రీన్ టీ తాగిన త‌ర్వాత ఆ బ్యాగ్‌ను పారేస్తాం. కానీ ఆ బ్యాగ్‌ని కాస్త చల్లారాక మొటిమలపై పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

మొటిమల వల్ల కొంతమందికి చర్మం వాపు కనిపిస్తుంది. దీనికి కూడా గ్రీన్ టీ బ్యాగ్ చక్కగా పని చేస్తుంది.

రాత్రి నిద్ర పోయే ముందు మొటిమలపై వెల్లుల్లిని చిదిమి రాస్తే మంచిది.

కలబంద జెల్‌ని అప్లయ్ చేస్తే మొటిమలు తగ్గడంతోపాటు మచ్చలు కూడా పోతాయి.

కలబందలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

బంగాళ దుంపను జూస్‌గా చేసి అందులో బియ్యం పిండి కలపండి.

ఈ మిశ్రమాన్ని రెండు రోజులకు ఒకసారి ఉపయోగిస్తే మొటిమలు మచ్చలు తొలగిపోతాయి.

టమాటా రసం, నిమ్మకాయ రసం మిక్స్ చేసి మొటిమలకు పట్టించండి.

కాసేపయ్యాక చల్లని నీటితో కడిగేస్తే మచ్చలు కూడా తగ్గుతాయి.

మొటిమలు ఉన్నాయ‌ని చర్మాన్ని ఎక్కువసార్లు కడిగినా ప్రమాదమే.

రోజుకు నాలుగైదుసార్లు క‌డిగితే చర్మంలోని ఆయిల్స్ తగ్గి సమస్య మరింత ఎక్కువవుతుంది.

అందుకే రోజుకు రెండుసార్లు శుభ్రపరుచుకుంటే చాలు.

గోడకో లేదా కుర్చీకో ఎక్కువ సేపు వీపును ఆన్చి కూర్చుంటే మొటిమల సమస్య తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇటువంటి వారికి మొటిమలతో పాటు దద్దుర్లు కూడా ఏర్పడతాయి.

నిత్యం యోగాతోపాటు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి మొటిమలను నివారించొచ్చు.

నిద్రలేమి వల్ల కూడా మొటిమల సమస్య తీవ్రంగా మారుతుందట.

అందుకే ప్రతి రోజూ కంటి నిండా నిద్ర పోవాలి. కనీసం 8 గంటలు పడుకోవాలి.

చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి. తగినంత తేమ తగిలేలా చూసుకోండి.

ఆయిల్ కంటెంట్ ఉన్న కాస్మొటిక్స్‌ను తక్కువగా ఉపయోగిస్తే మంచిది.

ఏది ఏమైనా ఈ వార్తా క‌థ‌నం మీ అవ‌గాహ‌న కొర‌కు మాత్ర‌మే. మొటిమ‌ల స‌మ‌స్య ఉన్న వారు డాక్ట‌ర్‌ను సంప్ర‌దిస్తే మంచిది.