ఉరికంభం ఎక్క‌బోతున్న తొలి మ‌హిళ‌

267

బుధ‌వారం నుంచి దేశ‌వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు ష‌బ్నం. ఎందుకంటే మ‌న దేశంలో ఉరి కంబం ఎక్క‌బోతున్న తొలి మ‌హిళ ఈమె. ఈమె ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఉంటుంది.

ప్రేమించిన వ్య‌క్తితో వివాహానికి కుటుంబ స‌భ్యులు అంగీక‌రించ‌లేద‌ని వారంద‌రిని ప్రియుడితో క‌లిసి హ‌త‌మార్చింది ఈమె.

13 ఏళ్ల క్రితం (2008) ప్రియుడు స‌లీంతో క‌లిసి కుటుంబ స‌భ్యులు ఏడుగురిని అతి కిరాత‌కంగ హ‌త‌మార్చింది.

అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపిన ఈ కేసును మ‌ధుర కోర్టు విచారించి ఇద్ద‌రికి మ‌ర‌ణ శిక్ష విధించ‌డం మ‌రో సంచ‌ల‌నంగా మారింది.

2010లో మ‌ధుర కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ ఈ దోషులిద్ద‌రు హై కోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా అదే పున‌రావృతం కావ‌డంతో 2015లో సుప్రీంకు వెళ్లారు.

చివ‌రికి అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని క్ష‌మాభిక్ష కోరారు. కానీ ఆయ‌న నుంచి కూడా వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో త్వ‌రలోనే వీరిని ఉరి తీయాల్సిందిగా మ‌ధుర కోర్టు జైలు అధికారుల‌ను ఆదేశించింది.

కుటుంబ స‌భ్యుల‌ను హ‌త‌మార్చే స‌మ‌యానికి ష‌బ్నం గ‌ర్భ‌వ‌తిగా ఉంది. దీంతో ఆమె జైల్లోనే మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

జైల్లోనే త‌న‌తో పాటే కుమారుడిని పెంచింది. చ‌ట్టం ప్ర‌కారం ఖైదీగా ఉన్న‌త‌ల్లి వ‌ద్ద పిల్ల‌లు ఆరు సంవ‌త్స‌రాలకు మించి ఉండ‌కూడ‌దు.

దీంతో 2015లో ష‌బ్నం కుమారుడిని ఎవ‌రైనా ద‌త్త‌త తీసుకుంటే ఇవ్వాల‌ని చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ భావించింది. ఆ మేర‌కు ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చారు.

కాలేజీ ఫ్రెండ్ సైఫీ

ష‌బ్నం కాలేజి ఫ్రెండ్ సైఫి ద‌త్త‌త తీసుకున్నాడు. ష‌బ్నం ఉరిశిక్ష ఖ‌రారైన సంద‌ర్భంగా సైఫి మాట్లాడుతూ ‘చదువుకునే రోజుల్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా నేను చాలా వీక్‌గా ఉండేవాడిని.

అప్పుడు షబ్నం నాకు ఎన్నో సార్లు డబ్బు సాయం చేసింది. ఆమె వల్ల నేను కాలేజీ చదువు పూర్తి చేయగలిగాను. ఆమె నాకు అక్క కన్నా ఎక్కువ. చదువు పూర్తయ్యాక నేను అక్కడి నుంచి వెళ్లి పోయాను.

ఆ తర్వాత ఆమె త‌న కుటుంబ సభ్యులను హత్య చేసిందని తెలిసి నేను షాక్‌ అయ్యాను. వెళ్లి ఆమెను కలవాలని అనుకున్నాను.

ఇదే సమయంలో షబ్నం కుమారుడి దత్తత సంబంధించిన యాడ్‌ చూశాం. గతంలో ష‌బ్నం నన్ను ఆదుకోకపోయి ఉంటే ఇప్పుడు ఇంత మంచి స్థితిలో ఉండేవాడిని కాదు.

ఆమె నాకు చేసిన మేలుకు రుణం తీర్చుకునే అవకాశం లభించింది. ఆమె కుమారుడి‌ బాధ్యత నేనే తీసుకోవాలనుకున్నాను. దీని గురించి నా భార్యతో కూడా మాట్లాడాను. ఆమె కూడా అంగీకరించింది.

ఆ తర్వాత మేము జైలుకు వెళ్లి షబ్నంని కలిశాము. ఆమె కుమారుడి‌ని మాతో పాటు తీసుకెళ్తాం. అతడి బాధ్యతను మేము తీసుకుంటాం అని అడిగాము. అందుకు ఆమె అంగీకరించింది.

ఇక బాబును ఎన్నటికి అతడి తల్లి పుట్టిన ఊరికి తీసుకెళ్లకూడదని భావించాం. ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడకు తీసుకెళ్లలేదు.

కొడుకు తాజ్

జైలులో తనకు పెట్టిన పేరు మార్చి.. తాజ్‌ అని పెట్టుకున్నాం. తల్లి గురించి తాజ్‌కు అన్ని వివరాలు తెలుసు. ఎంతైనా కన్న తల్లి కదా. ఆమె మీద ప్రేమను వదులుకోలేక పోతున్నాడు.

ఇక తర్వలోనే షబ్నంను ఉరి తీస్తారని తెలిసి ఆ చిన్నారి మనసు విలవిల్లాడుతుంది.

అందుకే తన తల్లిని క్షమించాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ని కోరుతున్నాడు. క్షమాభిక్ష పిటిషన్‌ని దాఖలు చేశాడు.

అమ్మ చనిపోతే నా పరిస్థితి ఏంటంటూ ఆ చిన్నారి అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు.

చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాడు. చూడాలి ఏమవుతుందో’ అని సైఫి వివ‌రించాడు.

ప్రస్తుతం సైఫి బులంద్‌షహర్‌లో జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.