భూమిపై త‌గ్గ‌నున్న ఆక్సిజన్ లెవల్స్

274

భూమిపై వాయు కాలుష్యం ఎక్కువైపోతోంది. వాహ‌నాల పొగ‌, ఫ్యాక్ట‌రీల పొగ కార‌ణంగా వాతావ‌ర‌ణం క‌లుషిత‌మ‌వుతోంది.

దీంతో ఆక్సిజ‌న్ లెవెల్స్ ప‌డిపోతున్నాయి. వాతావరణ మార్పులు పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని గతంలో ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి.

దీని వల్ల భూమిపై ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో భూమిపై ప్రాణవాయువు పూర్తిగా నశించిపోయే అవకాశం ఉందని తాజా పరిశోధన తేల్చింది.

భూమి వాతావరణంలో ఆక్సిజన్ మరో వంద కోట్ల సంవత్సరాల పాటు మాత్రమే సమృద్ధిగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఆ తరువాత జీవకోటి ప్రాణాలతో ఉండటానికి అవసరమైన స్వచ్చమైన గాలి భూమిపై ఉండదని తెలిపారు. ఈ అధ్యయనాన్ని నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.

భూమి వాతావరణంలో ఆక్సిజన్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందనే విషయాలను పరిశోధకులు విశ్లేషించారు.

సమీప భవిష్యత్తులో ఆక్సిజన్ స్థాయి పడిపోయే అవకాశం లేదు. కానీ ఒకసారి మార్పు ప్రారంభమైతే దాని పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయని అధ్యయనం పేర్కొంది.

శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా జరిగితే 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న వాతావరణం మళ్లీ భూమిపై నెలకొనే అవకాశం ఉంది.

భూమిపై గ్రేట్ ఆక్సిడేషన్ జరిగిన తరువాతే ఆక్సిజన్ ఏర్పడింది. ప్రాణవాయువు నశిస్తే అంతకు ముందు ఉన్న వాతావరణం మళ్లీ ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో భూమిపై నివసించే ఆక్సిజన్

ఆధారిత జీవస౦పద జీవితకాల౦పై కూడా అనిశ్చితులు నెలకొన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు భూమి వాతావరణ వ్యవస్థలో తేమగా ఉండే గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా ఏర్పడతాయి.

దీనివల్ల భూమి ఉపరితలంపై నీరు ఎక్కువగా ఆవిరయ్యే అవకాశం ఉంది. వేడి ఎక్కువగా ఉండే సౌర గాలులు ఏర్పడినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు.

సూర్యుడి నుంచి వెలువడే అధిక వేడి వ‌ల్ల మరో రెండు బిలియన్ సంవత్సరాల్లో సముద్ర జలాలు నశించిపోయే అవకాశం ఉందని గతంలో శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

కానీ 4,00,000 స్టిములేషన్స్‌తో చేసిన కొత్త పరిశోధనలో ముందు ఆక్సిజన్ తగ్గిపోయి జీవావరణం నశిస్తుందని తేల్చారు. ఆ తరువాతే నీరు కనుమరుగవుతుందని అంచనా వేస్తున్నారు.

ఆక్సిజన్ నశించిపోవడం తీవ్రమైన సమస్య అని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఎర్త్ సైంటిస్ట్ క్రిస్ రిన్హార్డ్ చెప్పారు.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ భవిష్యత్తులో పది లక్షల రెట్లు తక్కువకు పడిపోతుందని ఆయన వివరించారు.

ఇలాంటి పరిస్థితులను నివారించడానికి వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు.