ఏనుగుల‌పై ఊరేగూతూ ఒక్క‌టైన 59 జంట‌లు

264
Couples tie the knot on elephants on Valentine’s Day

– వినూత్నంగా పెళ్లాడారు
– బ్యాంకాక్‌లో 59 జంట‌లు
– ప్రేమికుల రోజున ఒక్క‌ట‌య్యారు

క‌రోనా వ‌ల్ల ఈ ఏడాది ప్రేమికుల రోజు చ‌ప్ప‌గా సాగింద‌నుకుంటున్నాం. కానీ థాయిలాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌లో ఓ వింత ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల రోజున థాయిలాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌లో 59 జంట‌లు ఒక్క‌ట‌య్యాయి. ఇందులో విశేష‌మేముంది అనుకుంటున్నారా? వీళ్లు గుళ్లో పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌వ్వ‌లేదు.

ఏనుగుల‌పై ఊరేగుతూ పెళ్లి చేసుకున్నారు. ఈ వింతైన సామూహిక వివాహాలు అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ర్షించాయి. గ‌జ‌రాజుల‌ను అందంగా ముస్తాబు చేసి వాటి మీద వ‌ధూవ‌రులు ఊరేగుతూ వ‌చ్చారు.

సంప్ర‌దాయ దుస్తుల‌తో ముస్తాబైన వ‌ధూవురులు మేళ‌తాళాలు, నృత్యాల‌తో ఉత్సాహంగా, ఊరేగింపుగా బ‌య‌లుదేరారు. ఈ అందాల వ‌ధూవ‌రుల‌ను చూడ‌టానికి చాలా మంది త‌ర‌లి వ‌చ్చారు.

వాతావ‌ర‌ణం అంతా సంద‌డి నెల‌కొని ఉంది. వ‌ధూవ‌రులు ఏనుగుల‌పై రావ‌డం విశేష‌మ‌నుకుంటూవుంటే.. స్థానిక అధికారులు కూడా ఏనుగులపైనే రావ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యాన్నిక‌లిగించింది.

ఏనుగులపైనే కూర్చొని వివాహ కార్య‌క్ర‌మాన్ని వీక్షించి వారికి పెళ్లి స‌ర్టిఫిక్టులు అందించారు. ఇలా వినూత్న రీతిలో ఒక్క‌టైన 59 జంట‌లు వివాహం త‌ర్వాత ఆనందంలో చిందులు వేశాయి.

వ‌టిఫ‌ట్ పంథ‌నాన్ అనే 26 ఏళ్ల పెళ్లికొడుకు ఈ వినూత్న వివాహంపై మాట్లాడుతూ.. త‌న వివాహం మామూలుగా కాకుండా ప్ర‌త్యేక‌మైన రీతిలో వినూత్నంగా జ‌ర‌గాల‌ని కోరుకునే వాడిన‌ని అన్నాడు.

తాను అనుకున్న‌ట్టుగానే ఏనుగుల‌పై ఊరేగుతూ వినూత్నంగా త‌న వివాహం జ‌రిగినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పాడు.

23 ఏళ్ల వ‌ధువు మాట్లాడుతూ.. తాను అనుకున్న‌ట్టుగానే ప్రేమికుల రోజున వివాహ లైసెన్స్‌పై సంత‌కం చేశాన‌ని కాస్త సిగ్గుప‌డుతూ చెప్పింది.

చోంబురి ప్రావిన్స్‌లోని నాంగ్ నూచ్ ట్రోపిక‌ల్ గార్డెన్స్‌లో ప్ర‌తి ఏటా ‘ఏనుగు సవారీ’ పెళ్లిళ్లు జ‌రుగుతాయి. వీటిని చూసేందుకు వేలాది మంది జ‌నాలు త‌ర‌లివ‌స్తారు.

వ‌ధూవ‌రుల‌తో పాటు వారి బంధుమిత్ర‌లు, వీక్ష‌కుల‌తో ఈ ప్రాంత‌మంతా సంద‌డిగా మారిపోతుంది. ఏదైనా వినూత్నంగా చేయాలంటే థాయ్‌లాండ్ వాసులు ముందుంటారు.

ఎంతో మంది ఇలా ఏనుగుల‌పై ఊరూగుతూ వ‌చ్చి ఒక్క‌ట‌వ్వ‌డం ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌రుగుతుంటుంది. అయితే క‌రోనా కార‌ణంగా ఈసారి ఆ సంఖ్య 59కి త‌గ్గింది.

నాంగ్ నూచ్ ట్రోపిక‌ల్ గార్డెన్ అధ్య‌క్షుడు కాంపోన్ టాన్స‌చా మాట్లాడుతూ.. క‌రోనా కార‌ణంగా క‌ఠిన‌మైన ఆంక్ష‌లు ఉండ‌టం మూలాన ఇప్పుడిప్పుడే ప‌ర్యాట‌కులు పార్క్‌కు వ‌స్తున్నార‌ని తెలిపారు.