తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 42,432 నమూనాలను పరీక్షించగా.. 189 మందికి కరోనా సోకినట్లు తేలింది.
కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. ఈ వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
తాజాగా నమోదైన 189 కేసులతో రాష్ట్రంలో ఒప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2,98,453కి చేరింది.
గత 24 గంటల్లో ఇద్దరు మరణించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో సంభవించిన కరోనా మరణాల సంఖ్య 1632కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 129 మంది పూర్తిగా కోలుకున్నారు.
దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 2,94,911 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1910 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 818 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 86,18,845 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా బులెటిన్లను వారానికోసారి ఇచ్చేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. కానీ హైకోర్టు మాత్రం రోజువారీగా వివరాలను వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.
వరుసగా రెండో రోజూ 16వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా 100కుపైనే ఉన్నాయి.
గత 24 గంటల వ్యవధిలో 8,31,807 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 16,577 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజాగా కరోనా బారినపడి 120 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,825కి చేరింది.
ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
గత 24 గంటలల్లో 12,179 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1.07 కోట్ల మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు.
ప్రస్తుతం దేశంలో 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి.