హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

870
comedian gundu hanumantha rao passed away

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నారు. ఉదయం 3:30 గంటలకు ఎస్‌ఆర్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైన హన్మంత రావు ను కుటుంబసభ్యులు హుటాహుటిన ఎర్రగడ్డ సెయింట్ థెరిసా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.



తెలుగు సినిమాల్లో మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన దాదాపు 400 సినిమాల్లో నటించారు. అహ నాపెళ్లంట, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బిరి బోండాం, బాబాయ్‌ హోటల్‌, శుభలగ్నం, క్రిమినల్‌, పెళ్లాం ఊరెళితే సినిమాల్లో అద్భతంగా న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రమాలకు ఇచ్చే నంది అవార్డులు అందుకున్నారు.

1956లో కాంతారావు, సరోజిని దంపతులకు హన్మంతరావు జన్మించారు. 1974లో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం రావణబ్రహ్మ. మద్రాసులో ఆయన నాటకాన్ని చూసిన జంద్యాల అహనా పెళ్లంట సినిమాలో మొదటి వేషం ఇచ్చారు. అనంతరం వరసగా సినిమా అవకాశాలు రావడంతో 50 సినిమాలు నటించిన తరువాత తన నివాసం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చారు. ఆయన భార్య ఝాన్సీరాణి(45) 2010లో మృతి చెందారు. సినిమాలకు ముందు హన్మంతరావు స్వీట్ షాపును నిర్వహించేవారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ తన అనారోగ్య విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదన్నారు. దీంతో విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయనకు 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4లక్షల ఆర్థిక సహాయం అందజేసింది.



హనుమంతరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎర్రగడ్డ స్మశాన వాటిక లో అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సబ్యులు తెలిపారు.