కాఫి ప్రియులూ.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

170

మ‌న దేశంలో చాలా మంది కాఫిని ఇష్ట‌ప‌డ‌తారు. కొంత మంది అయితే బెడ్ కాఫి తాగుతారు.

అలా తాగితేనే కాని ప్ర‌కృతి పిల‌వ‌ద‌ని చెబుతుంటారు. మ‌రికొంత మంది త‌ల‌నొప్పిగా ఉందంటూ కాఫిని తాగుతారు.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో చాలా మందికి కాఫి అంటే ప్రాణం. కాఫి తాగనిదే ఆ రోజు ముందుకు సాగ‌దు.

తాఫి తాగ‌క‌పోతే ఏదో వెలితిగా భావిస్తుంటారు. అస‌హ‌నంగా ఫీల‌వుతారు. అయితే కొంత మంది అదే ప‌నిగా ఎక్కువ‌సార్లు కాఫి తాగుతూ ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తుంటారు.

ఇటువంటి వారికి ఇదొక హెచ్చ‌రిక‌. అతిగా కాఫి తాగేవారికి ప్ర‌మాదం పొంచివుంద‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. కాఫి అధికంగా తాగ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

రోజుకు ఐదు క‌ప్పుల‌కు మించి కాఫి తాగేవారు గుండె జ‌బ్బ‌లు నుంచి త‌ప్పించుకోలేర‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు ఇందుకు సంబంధించిన వివ‌రాలను వెల్ల‌డించారు.

చాలా కాలంగా ప్రతిరోజూ ఐదు కప్పులకు మించి కాఫి తాగుతున్న వారిలో కఫెస్టోల్‌ అనే రసాయన మూలకం కార‌ణంగా కొవ్వు పేరుకుపోతోంద‌ని వివ‌రించారు. దీంతో వారిలో రక్త ప్రసరణ సరిగ్గా‌ జరగకపోవ‌డంతో గుండె సంబంధిత వ్యాధులు వ‌స్తున్నాయ‌ని వివరించారు.

ఫిల్టర్‌ చేయని కాఫిలో ఈ కఫెస్టోల్ అధికంగా ఉంటుందని చెప్పారు. కాఫీ ప్రియులు ఫిల్టర్‌ కాఫికి ప్రాధాన్య‌త ‌ఇస్తే బాగుంటుంద‌ని చెప్పారు. ఆరోగ్యంపై కాఫి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇంకా అధ్యయనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజుకు 300 కోట్ల కప్పుల కాఫిని తాగుతున్నారు. మ‌రోవైపు హృద్రోగాల‌తో ఏడాదికి 1.79 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కాఫి ఆరోగ్యానికి మంచిదా? కాదా..? అనే ప్రశ్నకు కొన్నేళ్లుగా పరిశోధకులు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. ఆ దిశగా ఎన్నో పరిశోధనలు కూడా చేశారు.

ఇంకా చేస్తూనే ఉనారు. కాఫి ఆరోగ్యానికి మంచిదని ఒక‌సారి.. హానికరమని మరోసారి తేల్చారు. కాఫి తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇంకోసారి చెప్పారు.

ఇలా పరిశోధన ఫలితాలు రకరకాలుగా వెలువడుతూనే ఉన్నాయి.తాజాగా నిర్వహించిన ఈ పరిశోధనలో కాఫి ఎక్కువగా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని తేల్చడం కాఫి ప్రియులను కలవరానికి గురి చేస్తోంది.

ఏది ఏమైనా, ఏ పరిశోధన ఫలితం ఎలా ఉన్నా, మన ఆహారపు అలవాట్లు హద్దులో ఉంటే ఏ సమస్యా రాదని డాక్టర్లు చెబుతున్నారు. ఏ అలవాటైనా హద్దు మీరితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఒక్కముక్కలో చెప్పాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నమాట.