టీవీ నటులను కూడా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, షూటింగ్‌లో అపశ్రుతుల కారణంగా పలువురు యువ హీరోలు గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘జబర్దస్త్’ ఫేం చలాకి చంటి పెద్ద ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న చలాకి చంటి కారు లారీని వెనక నుంచి ఢీకొంది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో సూర్యాపేట జిల్లా కోదాడ కొమరబండ వద్ద 65 నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, గతేడాది జూన్ నెలలో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ వద్ద జరిగిన కారు ప్రమాదం నుంచి చలాకి చంటి సురక్షితంగా బయటపడ్డాడు.