వాలెంటైన్స్ డే నాడే భార్య‌ను లంచ్‌కు తీసుకెళ్లి…

265

యువ‌తీ యువ‌కులైనా, భార్యాభ‌ర్త‌లైనా ప్రేమికుల రోజున త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తారు. అయితే ఓ భ‌ర్త ప్రేమికుల రోజున త‌న భార్య‌ను లంచ్‌కు అని బ‌య‌టికి తీసుకెళ్లి భోజ‌న‌మైన త‌ర్వాత అతి దారుణంగా హ‌త్య చేశాడు.

త‌ర్వాత తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకోబోయాడు. ఈ ఘ‌ట‌న ఘ‌జియాబాద్ జిల్లాలో జ‌రిగింది. అప్పుల భారం త‌ట్టుకోలేక ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ఉత్త‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియా జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న పూర్వాప‌రాలు ప‌రిశీలిస్తే….. దేవ్‌జీత్ ద‌త్‌, పూజా భార్య‌భ‌ర్త‌లు. ఐదేళ్ల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరి ప్రేమ‌కు ప్ర‌తి రూపంగా ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్ర‌తి ఏడాది వీరు వాలంటైన్స్ డేను ఆనందంగా జ‌రుపుకుంటారు. మ‌న‌సులో ఎన్నో బాధ‌లు ఉన్నా ఈ ఏడాది కూడా ప్రేమికుల రోజును సంతోషంగా జ‌రుపుకోవాల‌ని భావించారు.

ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 14న ముగ్గురు బ‌య‌టికి వెళ్లారు. లంచ్ చేశారు. అక్క‌డే కాసేపు కూర్చొని క‌బుర్లు కూడా చెప్పుకున్నారు.

చీక‌టిప‌డ్డాక వైశాలిలో ఉన్న సెక్టార్-3 ప్రాంతంలోని ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటికి వ‌చ్చే ట‌ప్పుడు త‌న కొడుకును దేవ్‌జిత్ త‌న అమ్మానాన్న‌ల వ‌ద్ద వ‌దిలి వ‌చ్చాడు.

ఏమైందో ఏమో తెలీదు కానీ ఉద‌యం లేచే స‌రికి దేవ్‌జీత్ ద‌త్ భార్య పూజ విగ‌త జీవిగా బెడ్‌పై ప‌డివుంది. అత‌నికి చేతి మ‌ణిక‌ట్టు తెగిపోయి ఉంది.

దేవ్‌జిత్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో లాభాలు రాలేదు. దీంతో అప్పులు చేశాడు. అవి ఎక్కువ‌య్యాయి.

అప్పులు తీర్చే దారి కాన‌రాక‌పోవ‌డంతో చావే శ‌ర‌ణ్య‌మ‌ని ఈ దంప‌తులు భావించారు. వాలెంటైన్స్ డే రోజు రాత్రి బ‌య‌టి నుంచి ఇంటికి తిరిగొచ్చాక దేవ్‌జిత్ త‌న భార్య‌ను చంపేశాడు.

ఆ త‌ర్వాత తాను కూడా క‌త్తితో మ‌ణిక‌ట్టును కోసుకున్నాడు. స్పృహ కోల్పోయి ప‌డివున్నాడు. ఉద‌యాన ఈ దృశ్యాన్ని చూసిన చుట్టుప‌క్క‌ల వాళ్లు పోలీసుల‌కు స‌మాచార‌మందించారు.

దీంతో వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు దేవ్‌జిత్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

దేవ్‌జిత్‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను అత‌ని భార్య‌కు తెలిపేందుకు లోప‌లికి వెళ్లిన పోలీసులు ఆమె కూడా విగ‌త జీవిత‌గా ప‌డివుండ‌టం చూసి ఖంగారు ప‌డ్డారు.

త‌ర్వాత కోలుకున్న దేవ్‌జిత్‌ను పోలీసులు విచారించ‌గా జ‌రిగిన సంగ‌తంతా చెప్పాడు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేపట్టారు.