గుండెపోటుతో కాంతారావు సతీమణి కన్నుమూత

291
Late Actor Kantharao Wife Hymavathi Passes Away

దివంగత సినీ నటుడు కాంతారావు భార్య హైమావతి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 87 సంవత్సరాల వయసున్న ఆవిడ గురువారం మధ్యాహ్నాం 12 గంటలకు తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. హైమావతి హైదరాబాద్ లోని మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు.

ఆమె మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

వెండితెరపై కత్తియుద్ధాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆయన 2009లో అనారోగ్యంతో కన్నుమూశారు. 1953లో వెండితెర ఇచ్చిన కాంతారావు దాదాపుగా 450 చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలు నిర్మించి అప్పులపాలైన కాంతారావు ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు.

అప్పటి నుండి వారి కుటుంబ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. దీంతో ప్రభుత్వ సహకారం కావాలని హైమావతి పలు సందర్భాల్లో కోరారు. విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని శ్రీమతి హైమావతికి అందించే ఏర్పాటు చేసింది.